సోమవారం 06 జూలై 2020
International - Jun 30, 2020 , 12:56:48

భారత్‌కు ఫ్రాన్స్‌ బాసట.. చైనా తీరును ఖండించిన ఆ దేశ రక్షణ మంత్రి

భారత్‌కు ఫ్రాన్స్‌ బాసట.. చైనా తీరును ఖండించిన ఆ దేశ రక్షణ మంత్రి

పారీస్‌: భారత్‌కు ఫ్రాన్స్‌ బాసటగా నిలిచింది. లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘరణలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకున్న చైనా తీరును ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఖండించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఈ మేరకు సోమవారం ఒక లేఖ రాశారు. ‘భారత సైనికులు, వారి కుటుంబాలకు చాలా పెద్ద నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో మా దేశం, మా దేశ ఆర్మీ తరుఫున స్థిరమైన, స్నేహ పూర్వక మద్దతు తెలుపుతున్నా’ అని అందులో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫ్రాన్స్‌కు భారత దేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి అని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ గుర్తుచేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆహ్వానిస్తే భారత్‌కు వచ్చి ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.

చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలను వీలైనంత తొందరగా సరఫరా చేస్తామని ఫ్రాన్స్‌ ఇప్పటికే భరోసా ఇచ్చింది. మరోవైపు భారత్‌పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఇప్పటికే పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. చైనా ఆగడాలను భారత్‌ ఎదుర్కొనేందుకు జర్మనీలోని తమ సైనిక దళాలను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇటీవల పేర్కొన్నారు.



logo