శనివారం 16 జనవరి 2021
International - Dec 25, 2020 , 01:37:50

బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరింది

బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరింది

  • బ్రిటన్‌, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
  • బ్రిటన్‌ వనరులు ఇకపై బ్రిటన్‌కేనన్న బోరిస్‌

లండన్‌: బ్రెగ్జిట్‌ పూర్తైంది. బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మధ్య ఎట్టకేలకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరింది. ఎఫ్‌టీఏ డీల్‌ పూర్తైనట్టు బ్రిటన్‌, ఈయూ ధ్రువీకరించాయి. ఒప్పందం కుదిరిన అనంతరం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్వేచ్ఛా సంకేతాన్ని ఇచ్చేలా గాల్లోకి చేతులు చాచి ఉన్న తన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బ్రెగ్జిట్‌కు సంబంధించి ఇదివరకే చాలా అంశాలు కొలిక్కి వచ్చినప్పటికీ బ్రిటన్‌ ప్రాదేశిక జలాల్లో చేపల వేటపై చిక్కుముడి వీడలేదు. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. బ్రిటన్‌ ప్రాదేశిక జలాల్లో చేపల వేటపై బ్రిటిష్‌ పౌరులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎలాంటి పరిమితి లేదని బోరిస్‌ వెల్లడించారు. ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణలు లేకుండా ఈయూ మార్కెట్‌లో బ్రిటన్‌ సరుకులు అమ్ముకోవచ్చన్నారు. తాజా డీల్‌ బ్రిటన్‌, ఈయూ మధ్య దౌత్య సంబంధాల్లో స్థిరత్వాన్ని తీసుకొస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌ పూర్తవడంతో బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ కూటమి నుంచి అధికారికంగా వైదొలగనున్నది. 

2016లో రెఫరెండం

ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని డిమాండ్‌ ఊపందుకున్న నేపథ్యంలో 2013లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌.. తమను మరోసారి ఎన్నికల్లో గెలిపిస్తే రెఫరెండం నిర్వహిస్తామని ప్రకటించారు. అధికారంలోకి  వచ్చాక 2016లో బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించారు. దీనికి 52 శాతం మంది అనుకూలంగా, 48 శాతం మంది వ్యతిరేకంగా ఓట్లేశారు.