మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 25, 2020 , 14:23:14

బాలికకు గుండు చేయించిన కుటుంబాన్ని బహిష్కరించిన ఫ్రాన్స్

బాలికకు గుండు చేయించిన కుటుంబాన్ని బహిష్కరించిన ఫ్రాన్స్

పారిస్: ఒక వ్యక్తితో సంబంధముందన్న కారణంతో ఒక బాలికకు ఆమె కుటుంబ సభ్యులు గుండు చేయించారు. దీంతో ఆ కుటుంబాన్ని తమ దేశం నుంచి బహిష్కరించినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రి జెరాల్డ్ డర్మానిన్ శనివారం తెలిపారు. బోస్నియా-హెర్జెగోవినాకు చెందిన 17 ఏండ్ల బాలిక తన కుటుంబంతో కలిసి రెండేండ్ల కింద ఫ్రాన్స్‌కు వలస వచ్చి బెసాన్కాన్ నగరంలో నివసిస్తున్నది. వారు ఉంటున్న బిల్డింగ్‌లోని మరో పోర్షన్‌లో నివాసం ఉంటున్న 20 ఏండ్ల క్రిస్టియన్ సెర్బ్ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు పెండ్లి చేసుకోవాలని ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఆమె కుటుంబ సభ్యులు విన్నారు. ఆ యువకుడ్ని బాలిక కలవకుండా కట్టడి చేశారు. ‘మనం ముస్లింలు, క్రిస్టియన్ వ్యక్తిని పెండ్లి చేసుకోవడం కుదరదు’ అని గట్టిగా చెప్పారు. అనంతరం ఆ బాలికను కొట్టి గదిలో బంధించారు. బాబాయ్, పిన్ని కలిసి ఆమెకు గుండు చేశారు.

మరోవైపు ప్రేమికుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆ బాలికను విడిపించారు. గాయపడిన ఆమెను  ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికపై ఆమె కుటుంబ సభ్యులు హింసకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. వారిని ఐదేండ్లపాటు దేశం నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. కాగా ఆ బాలికను ఫ్రాన్స్ అధికారులు సంరక్షణ కేంద్రంలో ఉంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.