మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 13:20:53

క‌ఠిన లాక్‌డౌన్ దిశ‌గా యూరోప్ దేశాలు..

క‌ఠిన లాక్‌డౌన్ దిశ‌గా యూరోప్ దేశాలు..

హైద‌రాబాద్‌: యూరోప్‌లోని కొన్ని దేశాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ అమ‌లు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.  గ‌త కొన్ని రోజుల నుంచి యూరోప్‌లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు సంఖ్య‌, మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పెద్ద దేశాలైన ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీలు.. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ అమ‌లుకు పూనుకున్నాయి.  శుక్ర‌వారం నుంచి ఫ్రాన్స్‌లో క‌ఠిన లాక్‌డౌన్ విధించ‌నున్నారు.  అత్యవ‌స‌రం అయితేనో లేక వైద్య కార‌ణాలు ఉంటేనే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో రెండ‌వ ద‌ఫా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయ‌ని, ఇది మొదటి దాని క‌న్నా శ‌క్తివంతంగా ఉంటుంద‌ని ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుల్ మాక్ర‌న్ తెలిపారు. మ‌రోవైపు జ‌ర్మ‌నీ మాత్రం చాలా స్వ‌ల్ప నిబంధ‌న‌ల‌తో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ది.  రెస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు, థియేట‌ర్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్ తెలిపారు. 

వాస్త‌వానికి యూరోప్ దేశాల్లో వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి.  బ్రిట‌న్‌లోనూ బుధ‌వారం కొత్త‌గా 24,701 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  310 మంది మ‌ర‌ణించారు.  ఇంగ్లండ్‌లో స‌గ‌టును ల‌క్ష మందికి వైర‌స్ సంక్ర‌మిస్తున్న‌ట్లు ఓ స్ట‌డీ వెల్ల‌డించింది. ఇక ఫ్రాన్స్‌లో ఏప్రిల్ త‌ర్వాత అత్య‌ధిక సంఖ్య‌లో రోజువారి మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి.  బుధ‌వారం రోజున ఆ దేశంలో కొత్త‌గా 36,437 మందికి వైర‌స్ సంక్ర‌మించింది.  244 మంది మ‌ర‌ణించారు.  జ‌ర్మ‌నీలో గ‌త 24 గంట‌ల్లో 16 వేల కొత్త కేసులు రికార్డు అయ్యాయి.  క్రిస్మ‌స్ వ‌ర‌కు ప‌రిస్థితి దారుణంగా ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ అంచ‌నా వేస్తున్న‌ది. 

తొలి ద‌ఫాలో యూరోప్‌లో కేంద్ర బిందువైన ఇట‌లీలోనూ అక్టోబ‌ర్ 26 నుంచి స్వ‌ల్పంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప్ర‌క‌టించారు.  బార్లు, రెస్టారెంట్ల‌ను సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు తెర‌వ‌నున్నారు.  ఆ త‌ర్వాత టేక‌వేల‌కు అవ‌కాశం క‌ల్పించారు.  జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, థియేట‌ర్లు, సినిమా హాళ్ల‌ను మూసివేశారు.  మ్యూజియంల‌ను రిఓపెన్ చేశారు.  పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌లు, బాప్టిజిం వేడుక‌ల‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై నిషేధం విధించారు.  సెకండ‌రీ పాఠ‌శాల‌ల్లో డిస్టాన్స్ లెర్నింగ్‌కు అవ‌కాశం క‌ల్పించారు.  స్పెయిన్‌లో అక్టోబ‌ర్ 25 నుంచి రాత్రి పూట క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించారు. ఈ నెలారంభంలో ఐర్లాండ్‌లో ఆరు వారాల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.