గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 14:32:51

91 గంట‌లు.. భూకంప శిథిలాల కింద నాలుగేళ్ల బాలిక‌

91 గంట‌లు.. భూకంప శిథిలాల కింద నాలుగేళ్ల బాలిక‌

హైద‌రాబాద్‌:  నాలుగు రోజుల క్రితం ట‌ర్కీలోని ఇజ్మీర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించిన విష‌యం తెలిసిందే.  ఆ భూకంప ధాటికి ఆ ప్రాంతంలోని అనేక బిల్డింగ్‌లు నేల‌మ‌ట్టం అయ్యాయి. అయితే బిల్డింగ్‌ల శిథిలాల కింద ఓ నాలుగేళ్ల బాలిక‌ ప్రాణాల‌తో స‌జీవంగా ఉన్న‌ది.  అయిదా గెజ్‌గిన్ అనే అమ్మాయిని రెస్క్యూ సిబ్బంది ఇవాళ ర‌క్షించింది.  బిల్డింగ్ కూలిన 91 గంటల త‌ర్వాత ఆ చిన్నారిని శిథిలాల కింద నుంచి ర‌క్షించ‌డం అద్భుతం. ఇజ్మీర్‌లోని బైరాక్లి జిల్లాలో వ‌చ్చిన 7.0 తీవ్ర‌త భూకంపం వ‌ల్ల అక్క‌డ బిల్డింగ్‌లు కూలాయి. పశ్చిమ టర్కీలో సంభవించిన భూకంపానికి మృతుల సంఖ్య మంగళవారం నాటికి వందకు పెరిగిందని ఆ దేశ విపత్తు అథారిటీ తెలిపింది. 7.0 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన ప్రకంపనలకు 994 మంది గాయపడ్డారని టర్కీకి ఏజెన్సీ తెలిపింది. ఇజ్మీర్‌ ప్రావిన్స్‌లోని రెస్క్యూ సిబ్బంది జాడలేకుండా పోయిన వ్యక్తుల కోసం ఐదు భవనాల్లో ఇంకా శోధిస్తున్నాయి. శిథిలాల నుంచి ఇద్దరు బాలికలను రక్షించారు. అక్టోబ‌ర్ 30న టర్కీలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా న‌మోద‌య్యింది. దీంతో ట‌ర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో సామోస్‌, ఏజియ‌న్ స‌ముద్రంలో చిన్నపాటి సమావేశం సునామీ వ‌చ్చింది.