మంగళవారం 31 మార్చి 2020
International - Feb 24, 2020 , 01:48:51

‘ఓడ’నంటున్న కరోనా

‘ఓడ’నంటున్న కరోనా
  • డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని మరో నలుగురు భారతీయులకు కొవిడ్‌
  • 12కు చేరిన సంఖ్య.. నౌకలో కరోనా పరీక్షల విశ్వసనీయతపై అనుమానాలు
  • చైనాలో 2,442 మంది మృతి.. 76,936 మందికి వైరస్‌ నిర్ధారణ

టోక్యో/షాంఘై/కొడోగ్నో/బీజింగ్‌, ఫిబ్రవరి 23:  జపాన్‌ తీరంలో నిలిపి ఉంచిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మరింత మంది భారతీయులకు ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాపిస్తున్నది. తాజాగా మరో నలుగురు భారతీయులు ఈ వైరస్‌ బారిన పడినట్టు జపాన్‌లోని భారత దౌత్యకార్యాలయం ఆదివారం ప్రకటించింది. దీంతో ఈ ఓడలో వైరస్‌ సోకిన భారతీయుల సంఖ్య 12కు చేరింది. మరోవైపు, డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల విశ్వసనీయతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాధి లక్షణాలు లేవని చెబుతూ నౌక నుంచి అధికారులు విడుదల చేసిన కొందరు ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. గత బుధవారం డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి ఓ 60 ఏండ్ల జపాన్‌ మహిళను అధికారులు విడుదల చేశారు. అయితే, ఇంటికి చేరుకున్న సదరు మహిళ అనారోగ్యం పాలవడం తో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. ఇలాగే నౌక నుంచి విడుదలైన మరో 20 మంది విదేశీయుల్లో కూడా వైరస్‌ లక్షణాలు గుర్తించామని అధికారులు తెలిపారు. దీంతో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో నిర్వహించిన కరోనా పరీక్షల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


దక్షిణ కొరియాపై కరోనా పంజా

కరోనా వైరస్‌ సోకి దక్షిణ కొరియాలో నలుగురు చనిపోగా, మరో 556 మందిలో వ్యాధి లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. కరో నా సోకి ఇటలీలో ఇద్దరు, ఇరాన్‌లో ఐదుగురు మృతిచెందగా.. చైనాలో 2,442 మంది మరణించారని ఆదివారం అధికారులు తెలిపారు. చైనాలో వైరస్‌ బాధితుల సంఖ్య 76,936కు చేరుకున్నట్టు వెల్లడించారు.   logo
>>>>>>