బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 13:29:40

26 ఏళ్ల తర్వాత మనిషి తలలో నుంచి 4 అంగుళాల కత్తి తొలగింపు

26 ఏళ్ల తర్వాత మనిషి తలలో నుంచి 4 అంగుళాల కత్తి తొలగింపు

హైదరాబాద్‌ : ఓ మనిషి తలలో నుంచి 4 అంగుళాల కత్తిని చైనా వైద్యులు తొలగించారు. అది కూడా 26 ఏళ్ల తర్వాత. షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన డౌరిజియో(76) అనే రైతుపై 26 ఏళ్ల క్రితం విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో అతని తలలోకి కత్తి దూసుకెళ్లి విరిగిపోయింది. అప్పట్నుంచి సదరు రైతు కత్తిని తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. అయితే 2012 సంవత్సరం నుంచి రైతుకు తీవ్రమైన తలనొప్పి రావడం, కుడి కన్నులో దృష్టి లోపం వచ్చింది.

ఈ నొప్పి క్రమంగా ఎక్కువ అవుతుండడంతో.. ఇటీవల వైద్యులను రైతు ఆశ్రయించాడు. డాక్టర్లు అతనికి ఎక్స్‌రే తీయగా.. తలలో తుప్పు పట్టిన 4 అంగుళాల కత్తి కనిపించింది. మొత్తానికి ఏప్రిల్‌ 2న రైతుకు వైద్యులు రెండు గంటల పాటు సర్జరీ చేసి ఆ కత్తిని తొలగించారు. ఏప్రిల్‌ 8న తలకు దెబ్బ తగిలిన ప్రాంతాన్ని శుభ్రం చేశారు వైద్యులు. బాధిత రైతు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అతనికి తలనొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, దృష్టి లోపం నుంచి కూడా బయటపడ్డాడు. 


logo