వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై 40 ఏళ్ల క్రితం హత్యాయత్న ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. 1981, మార్చి 30వ తేదీన వాషింగ్టన్‌లోని ఓ హోటల్ ముందు ఆ నాటి అధ్యక్షుడు రీగన్‌తో పాటు మరో ముగ్గురిపై 66 ఏళ్ల జాన్ హింక్లే అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న జాన్ హింక్లేపై శాశ్వతంగా కేసును ఎత్తివేయనున్నారు. అతన్ని వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నటి జోడీ ఫోస్టర్‌ను ఆకట్టుకునేందుకు దేశాధ్యక్షుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు జాన్ గతంలో తెలిపాడు. ట్యాక్సీ డ్రైవర్ సినిమాలో నటించిన జోడీ ఫోస్టర్ పట్ల సమ్మోహితుడైన జాన్ హింక్లే ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నిజానికి 2016లోనే వాషింగ్టన్ సైకియాట్రిక్ హాస్పిటల్ నుంచి హింక్లేను రిలీజ్ చేశారు. అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిపిన నాటి నుంచి అతన్ని ఆ హాస్పిటల్లోనే ఉంచారు. కొన్ని షరతులపై అతన్ని రిలీజ్ చేశారు. కానీ తన తల్లి స్వంత పట్టణమైన వర్జీనియాలోని విలియమ్స్బర్గ్ పరిధిలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మాజీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు నివసించే ప్రాంతాలకు వెళ్లవద్దు అంటూ అతనిపై ఆంక్షలు ఉన్నాయి.
న్యాయశాఖ, హింక్లే లాయర్ల మధ్య ఒప్పందం కుదిరిందని, దాని ఆధారంగా జూన్ 2022లో జాన్‌పై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించనున్నట్లు ఓ ఫెడరల్ జడ్జి తెలిపారు. జాన్ హింక్లేకు స్వేచ్ఛను ఇవ్వడాన్ని రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ తప్పుపట్టింది. వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్ వద్ద జరిగిన ఫైరింగ్‌లో.. రీగన్‌తో పాటు ఆయన ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, ఓ పోలీసు ఆఫీసర్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కూడా గాయపడ్డారు.