మంగళవారం 26 మే 2020
International - May 02, 2020 , 17:56:16

కరోనా: మలేషియాలో వలస కార్మికుల నిర్బంధం

కరోనా: మలేషియాలో వలస కార్మికుల నిర్బంధం

*కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా మలేసియా విదేశీ వలస కార్మికులను అరెస్టు చేస్తున్నది. రాజధాని కౌలాలంపూర్లో పెద్ద సంఖ్యలో విదేశీయులను నిర్బంధిచినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. పేద బస్తీల్లో శుక్రవారం నాటి దాడిలో 586 మంది నమోదు కాని విదేశీ పనివారు పట్టుబడ్డారు. ఇలా నిస్సహాయ వర్గాలను అరెస్టు చేస్తూపోతే వారు దాక్కోవడం, ఫలితంగా కరోనా వ్యాప్తిని గుర్తించలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. నిర్బంధితుల్లో మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా కాందిశీకులు ఉన్నట్టు తెలిసింది. వారిలో పిల్లలు కూడా ఉండడంపై హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కరోనా లాక్‌డౌన్ మధ్య పత్రాలు లేనివారు దేశంలో అటూఇటూ తిరుగకుండా చూసేందుకే దాడులు జరుపుతున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. కాగా వలస కార్మికులను నిర్బంధంలో ఉంచడం మంచిదికాదని, ఇరుకైన నిర్బంధ శిబిరాల్లో కరోనా సత్వరం వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఐక్యరాజ్య సమితి మలేషియాకు సూచించింది. అరెస్టుల వల్ల వలస కార్మికులు అజ్ఞాతంలోకి వెళ్తే సరైన చికిత్స అందదని కూడా గుర్తు చేసింది.


logo