గురువారం 04 జూన్ 2020
International - May 06, 2020 , 19:22:35

చైనాకు పాక్ ఓ సామంత రాజ్యం

చైనాకు పాక్ ఓ సామంత రాజ్యం

హైదరాబాద్: అమెరికాతో సంబంధాలు దిగజారిపోయి, బీజింగ్‌తో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్న పాకిస్థాన్‌పై అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డాక్టర్ మైకేల్ రూబిన్ తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ ఇంటరెస్ట్ పత్రికకు రాసిన ఓ వ్యాసంలో ఆయన..  చైనాకు పాక్ కేవలం ఓ వలస దేశంగా, సామంతరాజ్యంగా మారిందని దుయ్యబట్టారు. ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న ప్రజాస్వామిక దేశమైన భారత్ అమెరికాకు దగ్గరైన తర్వాతనే పాక్ చైనా వైపు మొగ్గిందని అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇండియా దాడి చేస్తే చైనా ఆదుకోగలదని పాక్ నేతలు నమ్ముతున్నారని రూబిన్ పేర్కొన్నారు. పైగా పాక్‌లో అవినీతిని, మైనారిటీల అణచివేతను, మానవహక్కుల ఉల్లంఘనలను చైనా పట్టించుకోదని కూడా వారు భావిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్‌ను చైనా ఓ పెద్ద మార్కెట్‌లా, పశ్చిమాసియాకు, గ్వాదార్ రేవుకు వంతెనలా మాత్రమే చూస్తుందని అన్నారు. అయినా పాకిస్థాన్ తాను ఎలాంటి కొరివితో తలగోక్కున్నదో తెలుసుకుంటుందని రూబిన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. పాకిస్థానీలను చంపడానికి, పాక్‌ను అవమానించడానికి వెనుకాడని దేశం చైనా అని ఇస్లామాబాద్ పాలకులకు తెలిసివస్తుందని రాశారు. కేవలం మత ప్రాతిపదికపై జింజియాంగ్ ప్రావిన్స్‌లో పదిలక్షల మందిని చైనా నిర్బంధంలో పెట్టిందని గుర్తు చేశారు.


logo