సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 22:51:43

చైనాలో భారీ వర్షాలు.. సిచువాన్ అతలాకుతలం

చైనాలో భారీ వర్షాలు.. సిచువాన్ అతలాకుతలం

బీజింగ్ : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చైనాలోని పలు పట్టణాలు చెరువులుగా మారాయి. వరదలు ఎక్కువవుతుండటంతో పరిస్థితులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. నైరుతి చైనాలో యాంగ్జీ నది వరదలు రావడంతో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. 

సిచువాన్ ప్రావిన్స్‌లో 1200 ఏండ్ల నాటి పురాతన బుద్ధ విగ్రహం పాదాలను నీరు తాకుతుండటంతో.. అది కూలిపోయే ప్రమాదానికి చేరుకున్నది. బుద్ధ విగ్రహాన్ని కాపాడటానికి పోలీసులు, స్థానిక ప్రజలు ఇసుకతో నింపిన సంచులను వేసి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 1949 తరువాత తొలిసారి వరద నీరు బుద్ధ విగ్రహం కాలికి చేరుకున్నాయి. అయితే, బుధవారం నాటికి సిచువాన్‌లో వరదనీరు కొద్దిగా తగ్గింది. బుద్ధ విగ్రహం పాదాలు మళ్లీ కనిపించాయి.

చైనా అధికారిక పీపుల్స్ డైలీ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక్కడి యునాన్ ప్రావిన్స్‌లో ఐదుగురు తప్పిపోయారు. సిచువాన్‌లోని యిబిన్‌లోని నిలిపిన 21 వాహనాలు రహదారి కూలిపోవడంతో అకస్మాత్తుగా గుంతలో కూలిపోయాయి. ఇప్పటివరకు 200 మంది మరణించారు. చైనా అంతటా వరదల కారణంగా చాలా మంది తప్పిపోయారు. వరదల కారణంగా సుమారు 25 బిలియన్ డాలర్ల (రూ.1,876 బిలియన్ల) నష్టం కలిగింది.

యాంగ్జీ జల వనరుల కమిషన్ మంగళవారం వరదలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. యాంగ్జీ నది 1981 నుంచి అత్యంత భయంకరమైన వరదలను ఎదుర్కొన్నది. చారిత్రాత్మక నగరమైన సియాకికో లోతట్టు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇండ్లు నీటిలో తేలియాడుతున్నాయి.


logo