మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 23:01:28

రేపటి నుంచి అమెరికా, ఫ్రాన్స్ కు విమానాలు

రేపటి నుంచి అమెరికా, ఫ్రాన్స్ కు విమానాలు

న్యూఢిల్లీ: రేపటి నుంచి అంతర్జాతీయ విమానాలు నడువనున్నాయి. తొలుత అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు విమానాలు నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. శుక్రవారం నుంచి అమెరికాకు, శనివారం నుంచి ఫ్రాన్స్ కు విమానాలు నడుపనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా నాలుగు నెలల క్రితం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలతో తాజాగా భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాల నేపథ్యంలో శుక్రవారం నుంచి అమెరికా-భారత్ మధ్య , శనివారం నుంచి ఫ్రాన్స్- భారత్ దేశాల మ‌ధ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి గురువారం వెల్లడించారు.

అమెరికా, భారత్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ జులై 17 నుంచి 31 తేదీల మధ్య 18 విమానాలను నడుప‌నున్నారు. ఢిల్లీ- న్యూయార్క్‌ మధ్య ప్రతిరోజు, ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులపాటు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎయిర్‌ ఫ్రాన్స్‌ ఎయిర్ లైన్స్ సైతం జూలై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన స‌ర్వీసుల‌ను నడుపనుందని మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 

జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం పూర్తి కావచ్చిందని.. త్వరలోనే జర్మనీ-భారత్ మధ్య సైతం విమాన సేవలు ప్రారంభం అవుతాయని, అమెరికా, ఫ్రాన్స్ తరహాలోనే త్వరలోనే బ్రిటన్‌తోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ-లండన్‌ మధ్య రోజుకు రెండు చొప్పున విమానాలు నడిపేలా ఈ ఒప్పందం ఉండనున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. 


logo