బుధవారం 27 మే 2020
International - May 05, 2020 , 13:23:26

చికిత్స పొందాడు..ఇద్దరు పిల్లలకు కరోనా అంటించాడు

చికిత్స పొందాడు..ఇద్దరు పిల్లలకు కరోనా అంటించాడు

హైదరాబాద్: ఫ్రాన్స్‌లో అధికారికంగా తొలి కరోనా రోగిని గుర్తించినట్టు ప్రకటించడానికి నెలరోజులు ముందే అక్కడ ఆ వైరస్ వ్యాపించినట్టు తాజా వెల్లడైంది. డిసెంబర్ 27న న్యూమోనియాకు చికిత్స పొందిన వ్యక్తి రక్తం నమూనాలపై మరోసారి పరీక్షలు జరుపగా కరోనా ఉన్నట్టు బయటపడింది. డిసెంబర్, జనవరిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందిన 24 మంది రోగుల శాంపిల్స్‌పై మరోసారి పరీక్షలు నిర్వహించినట్టు సీనియర్ ఫ్రెంచ్ వైద్యుడు డాక్టర్ ఈవ్స్ కోహెన్ తెలిపారు. అందులో ఒకవ్యక్తికి డిసెంబర్ 27నే కరోనా ఉన్నట్టు తేలిందని ఆయన వివరించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు దాదాపు 25 వేలమంది కరోనాకు బలయ్యారు. తొలి కరోనా రోగి జనవరి 24 నమోదు అయినట్టు ప్రకటించారు.

అయితే తాజా పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన 'డిసెంబర్ 27' రోగి ప్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి మూల కారకుడా? అనేది అప్పుడే చెప్పలేమని డాక్టర్ ఈవ్స్ కోహెన్ అన్నారు. మొదట ఎవరికి వచ్చింది.. అంటే ఎవరి ద్వారా వ్యాపించింది అనేది తెలుసుకోవడం కరోనా వ్యూహంలో చాలా ముఖ్యం. 15 రోజులపాటు అతడు చికిత్స పొందాడు. ఇద్దరు పిల్లలకు కరోనా అంటించాడు. సూపర్‌మార్కెట్లో పనిచేసే భార్యకు మాత్రం ఏమీ కాలేదు. ఇంతకూ ఆ వ్యక్తికి కరోనా ఎక్కడ పట్టుకుంది? అనేది పెద్ద ప్రశ్న. అతడు విదేశాలకు వెళ్లిరాలేదు. అతనికి వస్తేగిస్తే భార్య నుంచి రావాలి. ఎందుకంటే ఆమె చైనా సంతతి ప్రజలు ఎక్కువగా పోగయ్యే సుషీ స్టాల్‌కు దగ్గరలో పనిచేసేది.

ఆ స్టాల్ సందర్శించే చైనీయుల్లో ఎవరైనా చైనాకు వెళ్లివచ్చారా? అనేది తేలాల్సి ఉంది. 'డిసెంబర్ 27' రోగి భార్య లక్షణాలు లేకుండా కరోనాను వ్యాపింపజేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఫ్రాన్స్ తొలిరోగి ఎవరో తేల్చగలమని డాక్టర్ ఈవ్స్ కోహెన్ అంటున్నారు.


logo