ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 12:10:56

సాక‌ర్ ఆట‌గాడితో ప్ర‌ధాని పెండ్లి!

సాక‌ర్ ఆట‌గాడితో ప్ర‌ధాని పెండ్లి!

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల స్నేహితుడు, సాకర్‌ ఆటగాడు అయిన‌ మార్కస్‌ రాయ్కెన్‌ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని సనా మారిన్‌ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నేను ప్రేమించిన‌ వ్యక్తితో జీవితం పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలు షేర్‌ చేశారు. సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడ్డ తాము ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కాగా, సనా మారిన్‌- మార్కస్‌ల వివాహం ప్రధాని అధికారిక నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది.  ఈ వేడుకలో వధూవరులకు అత్యంత సన్నిహితులైన 40 మంది అతిథులు మాత్ర‌మే పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఫిన్‌లాండ్‌ ప్రభుత్వం సైతం కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఫొటోను షేర్‌ చేసింది. పెండ్లిలో వధువు సనా మారిన్‌ పొడవాటి తెలుపు రంగు గౌనులో తళుకులీనగా.. వరుడు మార్కస్‌ క్లాసిక్‌ టక్సిడో సూట్‌లో హుందాగా కనిపించారు. 

కాగా, పదహారేండ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్‌ అనే రెండేండ్ల‌ కూతురు ఉంది. తమ పద్దెనిమిదో ఏటనే ప్రేమలో పడిన వీరు శనివారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక గతేడాది డిసెంబర్‌లో ఫిన్‌లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్‌..  ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో (34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా చరిత్రకెక్కారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo