సోమవారం 01 జూన్ 2020
International - May 19, 2020 , 18:06:48

మాస్క్‌ ధరించకపోతే రూ.61,772 జరిమానా

మాస్క్‌ ధరించకపోతే రూ.61,772 జరిమానా

దుబాయ్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొంటున్నా.. ప్రజలు అడపాదడపా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తాము చేసే నియమాలు మీ కోసమే అని ప్రభుత్వాలు ప్రజలకు చెప్తున్నా పట్టించుకొంటున్న దాఖలాలు కానరావడంలేదు. అందుకనే అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను తీసుకొచ్చింది. కొవిడ్‌-19ను కట్టడి చేయాలంటే ఈ మాత్రం నిబంధనలు ఉండాల్సిందే అని డంకా బజాయించి మరీ హెచ్చరిస్తున్నారు అక్కడి అధికారులు. మాస్క్‌లు ధరించనివారికి రూ. 61,772, క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించేవారికి రూ.10,29,539 చొప్పున జరిమానా విధించాలని దుబాయ్‌ పాలకులు చట్టం చేశారు. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించేవారికి రూ.20 లక్షల జరిమానా విధించనున్నారు.

కరోనా వైరస్‌ యొక్క రోజువారీ కేసుల పెరుగుదల నివేదికలను గమనించిన తర్వాత ఈ వారం నుంచి రాత్రి పూట రెండు గంటల పాటు కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు దుబాయ్‌ ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఇకపై రాత్రి 10 గంటలకు బదులుగా 8  గంటలకే మొదలై ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే  విమానాల రాకపోకలను నిలిపివేసిన అక్కడి ప్రభుత్వం.. రంజాన్‌ పర్వదినం సందర్భంగా కొనుగోళ్లు జరుపుకొనేందుకు వీలుగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాల్స్‌ తెరుచుకొనేందుకు అనుమతినిచ్చారు. తక్కువ  మందిని అనుమతినిస్తూ రెస్టారెంట్లు, కెఫేలు నడుపుకొనేందుకు కూడా దుబాయ్‌ ప్రభుత్వం అనుమతించింది. సోమవారం వరకు అరబ్‌ ఎమిరేట్స్‌లో 832 కేసులు బయటపడగా.. నలుగురు మరణించారు. దీంతో మొత్తం 224 మంది మృతిచెందగా.. కేసుల సంఖ్య 24,190 కి చేరింది.


logo