బుధవారం 03 జూన్ 2020
International - May 18, 2020 , 20:54:49

కరోనాపై దర్యాప్తు చేయండి.. కానీ, ఇప్పుడు కాదు: చైనా

కరోనాపై దర్యాప్తు చేయండి.. కానీ, ఇప్పుడు కాదు: చైనా

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కు చెందిన వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ 73 వ వార్షిక సమావేశాల సందర్భంగా వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకొస్తున్న కరోనా వైరస్‌ మూలాలపై దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచదేశాలు మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నందున..  సమస్యపై పట్టుసాధించిన తర్వాతనే ఈ కార్యక్రమాలను చేపట్టడం అందరికీ శ్రేయస్కరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన ఈవ్యాధి తొలుత బయటపడిన సమయంలో చైనా ప్రభుత్వం.. బహిరంగత, పారదర్శకతతో బాధ్యతతో వ్యవహరించిందని జిన్‌పింగ్‌ చెప్పారు.

సమావేశం ప్రారంభం కాగానే కొవిడ్‌-19పై దర్యాప్తు చేపట్టేందుకు ముందుకురావాలని యురోపియన్‌ యూనియన్‌ రూపొందించిన తీర్మానం తర్వాత.. ప్రారంభ సమావేశంలో ప్రసంగించాలని జిన్‌పింగ్‌కు సూచించారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన జిన్‌పింగ్‌.. కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే, ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై పట్టుసాధించిన తర్వాత విచారణ చేపడదామన్నారు. ఈ కీలక సమయంలో డబ్ల్యూహెచ్‌వోకు మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ సహకారం అందించడం, ప్రజల ప్రాణాలను రక్షించే యుద్ధానికి మద్దతు ఇవ్వడం అవసరమని నొక్కిచెప్పారు. ప్రపంచ తక్షణ కర్తవ్యం ప్రజలను రక్షించడమే అని చెప్పారు. గతంలో వాషింగ్టన్‌, కాన్‌బెర్రాల నుంచి వచ్చిన డిమాండ్‌లను చైనా తోసిపుచ్చింది. కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేపట్టేందుకు 120 దేశాలు పట్టుబడుతున్నాయని, ఫార్మల్‌గా అనుమతి పొంది విచారణ చేపడితే బాగుంటుందని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఓ అధికారి చెప్పారు.


logo