గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 09, 2020 , 11:46:27

మిచిగ‌న్ గ‌వ‌ర్న‌ర్ కిడ్నాప్‌కు ప్లాన్‌..

మిచిగ‌న్ గ‌వ‌ర్న‌ర్ కిడ్నాప్‌కు ప్లాన్‌..

హైద‌రాబాద్‌:  అమెరికాలోని మిచిగ‌న్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గ్రెచ‌న్ విట్మెర్ అప‌హ‌ర‌ణ‌కు వేసిన ప‌న్నాగాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భ‌గ్నం చేశారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అత్యంత క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న ఆ గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రిని ఖండిస్తూ కొంద‌రు ఆమె‌ను కిడ్నాప్ చేయాల‌ని భావించారు. అయితే ఆ ప్లాన్‌ను ఎఫ్‌బీఐ ప‌టాపంచ‌లు చేసింది. కిడ్నాప్ ప్లాన్ వేసిన ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. విద్వేషం, హింస‌కు రాష్ట్రంలో తావు లేద‌ని గ‌వ‌ర్న‌ర్ విట్మెర్ తెలిపారు. జూన్‌లో ఓహియాలోని డ‌బ్లిన్‌లో నిందితులు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి.. గ‌వ‌ర్న‌ర్ అప‌హ‌ర‌ణ‌కు ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది.  మిచిగ‌న్ తీవ్ర‌వాద గ్రూపుగా ఏర్పడిన వారు.. అమెరికా రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం ఉల్లంగిస్తున్న‌ట్లు ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ విట్మెర్‌పై దేశ‌ద్రోహం కేసు కింద విచాణ చేప‌ట్టాల‌ని కూడా ఆ దుండ‌గులు ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. 

ఈ కేసుతో ప్ర‌మేయం ఉన్న 13 మంది పేర్ల‌ను అధికారులు వెల్ల‌డించారు.  ఉగ్ర‌వాదం, గ్యాంగ్ వార్ సంబంధిత చ‌ట్టాల ఆధారంగా వారిపై కేసు న‌మోదు చేశారు.  200 మంది స‌భ్యులుగా ఏర్ప‌డిన త‌ర్వాత‌.. క్యాపిట‌ల్ బిల్డింగ్‌లోకి ప్ర‌వేశించి అక్క‌డ వారిని ఆధీనంలోకి తీసుకోవాల‌ని భావించారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల లోపు గ‌వ‌ర్న‌ర్‌ను అప‌హ‌రించాల‌ని ప్లాన్ వేశారు. ఒక‌వేళ వారి ప్ర‌ణాళిక విఫ‌లం అయ్యితే, అప్పుడు గ‌వ‌ర్న‌ర్‌ను ఇంటి వ‌ద్ద అటాక్ చేయాల‌ని భావించిన‌ట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు.