మంగళవారం 19 జనవరి 2021
International - Dec 26, 2020 , 09:27:54

అమెరికాలో పేలుడు కలకలం

అమెరికాలో పేలుడు కలకలం

వాషింగ్టన్‌ : అమెరికాలో భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండుగ రోజున ఈ ఘటన జరుగడం కలకలం సృష్టించింది. టెన్నటీ రాష్ట్రంలోని నాష్‌విల్లే పట్టణంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి నగరం కంపించగా.. సుమారు 20 భవనాలతో పాటు వాహనాలు దెబ్బతిన్నాయి. ఇందులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే పేలుడు ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తాము నమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్‌ ప్రతినిధి డాన్ ఆరోన్ మాట్లాడుతూ ఉదయం 6:30 గంటలకు పేలుడు జరిగిందని ఇది ‘ఉద్దేశపూర్వక చర్య’ అని పేర్కొన్నారు. పేలుడులో గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోన్‌ పేర్కొన్నారు. పేలుడు కేసును ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని జోయెల్‌ సిస్కోవిక్‌ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఎస్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అవి ఎవరివన్నది మాత్రం పోలీసులు ఇంకా గుర్తించలేదు. పేలుడుకు కారణమైన వ్యక్తికి చెందినవై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే పేలుడు సమయంలో దగ్గరలో ఉన్న వారివైనా అయి ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

మరికాసేపట్లో బాంబు పేలబోతోంది...


పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాటికి స్పందిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీస్‌ చీఫ్‌ జాన్‌ డ్రేక్‌, ప్రతినిధి డాన్‌ ఆరోన్‌ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో గాలింపులు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ మోటార్‌ హోం నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన వచ్చినట్లు తెలిపారు. ‘మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది’ అంటూ రికార్డ్ చేసి ఉంచిన సందేశం వినపడిందని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకటన వచ్చిన కాసేపటికే వ్యాన్‌ పేలినట్లు వెల్లడించారు. అయితే హెచ్చరిక వాయిస్‌ మహిళ గొంతులా ఉందని పేర్కొన్నారు. అయితే, పేలుడుకు ముందు అక్కడ కాల్పులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటనపై ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. ఎవరికీ అరెస్టు చేయకపోయినా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటన దురదృష్టకరమైందని మేయర్‌ జాన్‌ కూపర్‌ అన్నారు. పేలుడు ఘటనపై అమెరికా ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతినిధి జుడ్‌ డీర్‌ ట్విట్‌ చేశారు. ఘటనపై త్వరగా స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.