న్యూఢిల్లీ : కరోనా వైరస్ మూలాలపై చైనాను అమెరికా మరోసారి తప్పుపట్టింది. డబ్ల్యూహెచ్ఓ అధికారులను చైనా తప్పుదారి పట్టించిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన అధికారి జాన్ బోల్టన్ ఆరోపించారు. డ్రాగన్ తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ తమ లేబొరేటరీ నుంచే పుట్టుకొచ్చిందా అని స్వయంగా వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధిపతే ఆందోళన చెందారని బోల్టన్ ఓ జాతీయ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ పేర్కొన్నారు.
కరోనా మూలాలపై చైనా నుంచి పూర్తి సమాచారం, సహకారం రాబట్టేందుకు అమెరికా ప్రయత్నించాలని అగ్రరాజ్య మాజీ జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్ స్పష్టం చేశారు. మహమ్మారి పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ఎలాంటి ప్రభుత్వం ఉందని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సగటు పౌరులందరికీ బోధపడిందని అన్నారు. తన జీవాయుధాల కార్యక్రమం పట్ల చైనా గుట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆయుధ నియంత్రణ వ్యవహారాలపై కీలక చర్చలకు డ్రాగన్ విముఖత చూపుతుందని బోల్టన్ వ్యాఖ్యానించారు.