బుధవారం 05 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 18:27:45

ప్రతీ ఒక్కరికీ కరోనా రావడం మాత్రం ఖాయం

ప్రతీ ఒక్కరికీ కరోనా రావడం మాత్రం ఖాయం

బ్రసిలియా : 'కరోనా వైరస్ కు ప్రతీ ఒక్కరూ గురికావాల్సిందే. మనందరికి ఏదో ఒకనాడు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని దాన్ని చూసి భయపడకండి. ధైర్యంగా ఎదుర్కొండి'.. ఈ వేదాంత ధోరణి మాటలు ఎవరివో కాదు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోవి. కొవిడ్-19 కు గురై అధ్యక్ష భవనంలోనే క్వారంటైన్ లో ఉండి రెండు రోజుల క్రితం కోలుకున్నారు. ఆయన కోలుకుని బయటకు రాగా.. ఆయన భార్యకు ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలడంతో హోం క్వారంటైన్ అయ్యారు.

జూలై నెల ప్రారంభంలో కొవిడ్-19 తో బాధపడిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక సమయంలో కరోనా వైరస్ కు గురవుతారని అన్నారు. "దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వైరస్ కు గురవుతారని నేను భావిస్తున్నాను" అని దక్షిణ రాష్ట్రమైన రియో ​​గ్రాండే డో సుల్ సందర్శన సందర్భంగా మీడియాతో అన్నారు. వైరస్ గురించి మీరు భయపడుతున్నారా? వద్దు.. దానిని సమర్ధంగా ఎదుర్కోండి.. నేను మరణాలకు చింతిస్తున్నాను అని చెప్పారు. కరోనా వైరస్ నిర్ధారణ తరువాత యాంటీబయాటిక్స్ తీసుకున్నానని బోల్సోనారో వెల్లడించారు.

కరోనా వైరస్ కు గురైన తర్వాత బోల్సోనారో తన అధ్యక్ష నివాసంలో దాదాపు ఒక నెల నిర్బంధంలో గడిపారు. అధికారిక సమాచారం ప్రకారం, బోల్సోనారో 18 రోజుల్లో నాలుగు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా.. మూడుసార్లు పాజిటివ్ గా తేలింది. కాగా, అధ్యక్షుడి సతీమణి మిచెల్ బోల్సోనారోతోపాటు ఆ దేశ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ పోంటెస్ కూడా పాజిటీవ్ గా తేలింది. అలాగే అధ్యక్షుడి దగ్గరి సహాయకులలో ఇద్దరు కూడా పాజిటివ్ పరీక్షించిన తర్వాత ఇంట్లో నిర్బంధంలో ఉన్నారు. పౌరసత్వ మంత్రి ఒనిక్స్ లోరెంజోని, విద్యా మంత్రి మిల్టన్ రిబీరో, గనులు మరియు ఇంధన బాధ్యత కలిగిన బెంటో అల్బుకెర్కీ, సంస్థాగత భద్రతా మంత్రిగా ఉన్న అగస్టో హెలెనో మార్చిలో సానుకూల పరీక్షలు చేసినప్పటికీ త్వరగా కోలుకున్నారు.

బోల్సోనారో గతంలో కొవిడ్-19 ను "చిన్న ఫ్లూ" తో పోల్చారు. లాక్డౌన్ చర్యలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా ఉంటుందని చెప్పారు. బ్రెజిల్ ప్రస్తుతం రెండో అత్యధిక కరోనా వైరస్ కేసులు 2,662,485 నమోదవగా.. 92,475 మరణాలు సంభవించాయి.


logo