గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 14:53:12

ప్ర‌తి 40 సెక‌న్ల‌కు ఓ సూసైడ్‌..

ప్ర‌తి 40 సెక‌న్ల‌కు ఓ సూసైడ్‌..

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 40 సెక‌న్ల‌కు ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు.  ఈ విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. వ‌ర‌ల్డ్ సూసైడ్ ప్రివెన్ష‌న్ డే సంద‌ర్భంగా డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఈ అంశంపై మాట్లాడారు. తీవ్ర‌మైన మాన‌సిక క్షోభ‌లో ఉన్న‌వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డాల‌ని భావించ‌డం స‌హ‌జ‌మే. కానీ వారిని ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల నుంచి వేరు చేయాల‌ని టెడ్రోస్ సూచించారు. ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించ‌వ‌చ్చు అని,  సూసైడ్ చేసుకోవాల‌నుకుంటున్న వారితో కాసేపు ఏకాంతంగా ముచ్చ‌టిస్తే, వారిలో మానసిక ఆందోళ‌న‌ను త‌గ్గించ‌వ‌చ్చు అన్నారు. ఏదో ఒక కార‌ణం చేత.. ఎవ‌రో ఒక‌రు సూసైడ్ చేసుకుంటున్నార‌ని, ప్ర‌తి ఒక మ‌ర‌ణం ఆ వ్య‌క్తి కుటుంబానికి ఓ విషాద‌మ‌ని తెలిపారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా సూసైడ్ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయ‌ని, వాటికి వ‌య‌సు, జెండ‌ర్‌, ఆర్థిక ప‌రిస్థితితో సంబంధం లేద‌న్నారు.  సెప్టెంబ‌ర్ 10వ తేదీన వ‌ర‌ల్డ్ సూసైడ్ ప్రివెన్ష‌న్ డే పాటిస్తారు.  

15 నుంచి 29 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారిలో మ‌ర‌ణాల‌కు సూసైడ్ రెండ‌వ కార‌ణంగా ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ప్ర‌తి దేశం సూసైడ్ ప్రివెన్ష‌న్ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయాల‌న్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటున్న‌వారికి .. క్రిమిసంహార‌కాల‌ను, ఆయుధాల‌ను దూరంగా ఉంచే విధంగా చూడాల‌‌న్నారు. త‌మ జీవితాల్లో వ‌త్తిడిని త‌ట్టుకునే విధంగా యువ‌త‌ను తీర్చిదిద్దాల‌న్నారు. సూసైడ్ రిస్క్‌లో ఉన్న‌వారిని ముందుగా గుర్తించి, వారికి త‌గిన చేయూత‌నివ్వాల‌న్నారు. మీడియా కూడా సూసైడ్ కేసుల‌ను సున్నితంగా రిపోర్ట్ చేయాల‌న్నారు. సూసైడ్‌, మెంటల్ హెల్త్‌పై అవ‌గాహ‌న పెంచాల‌న్నారు. సంఘీభావంతోనే ఆత్మ‌హ‌త్య‌ల‌ను జ‌యించ‌వ‌చ్చు అని టెడ్రోస్ తెలిపారు. 


logo