బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 12:52:22

కరోనా: ఆఫీసుకు వెళ్లాలంటే ఆ పాస్‌పోర్టు తప్పనిసరా?

కరోనా: ఆఫీసుకు వెళ్లాలంటే ఆ పాస్‌పోర్టు తప్పనిసరా?

తాలిన్: కరోనా మనల్ని ఇప్పుడప్పుడే వదిలిపెట్టదని అంటున్నారు. వైరస్ తో సహజీవనం తప్పదనీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫీసుకు డ్యూటీకి వెళ్లాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలా అని చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అటు యాజమాన్యాలకూ ఏమీ తోచడం లేదు. అపనమ్మకాలు, భయాలు పోవాలంటే డిజిటల్ ఇమ్యూనిటీ పాస్‌పోర్టు విధానం ఒక్కటే శరణ్యం అంటున్నది ఇస్తోనియా. బాల్టిక్ తీరంలోని యూరప్ దేశమైన ఇస్తోనియా సరికొత్త సాంకేతికతను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఆఫీసుకు సురక్షితంగా వెళ్లేందుకు ఈ పాస్‌పోర్టు భరోసా ఇస్తుందని అంటున్నారు. ట్రాన్స్‌ఫర్‌వైజ్, బోల్ట్ అనే రెండు స్టార్టప్ కంపెనీలు దీనిని రూపొందించాయి. ఈ డిజిటల్ పాస్‌పోర్టు టెస్టింగ్ డేటాను సేకరించి యాజమాన్యం వంటి థర్డ్‌పార్టీతో పంచుకుంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా డేటా తెలుసుకోవచ్చు. భయాలను తొలగించి ప్రోత్సాహపూరిత వాతావరణం కల్పించడం ఈ యాప్ ఉద్దేశమని ట్రాన్స్‌ఫర్‌వైజ్ వ్యవస్థాపకుడు తావెత్ హిన్రికస్ చెప్పారు. రాడిసన్ హోటల్స్, పీఆర్ ఫుడ్స్ కంపెనీలు మొట్టమొదటగా ఈ పాస్‌పోర్టును వినియోగించేందుకు ముందుకు వచ్చాయి. 'మా ఉద్యోగులు సురక్షితంగా పనిలోకి రావాలి.. మా హోటల్‌కు అతిథులు భరోసాతో రావాలి.. అందుకే ఈ పాస్‌పోర్టును అమలు చేస్తున్నాం' అని తాలిన్‌లోని రాడిసన్ బ్లూస్కై హోటల్ సీఈవో కైదో ఓజాపెర్వ్ చెప్పారు. ఈ సరికొత్త డిజిటల్ పాస్ పోర్టు గురించి వింటుంటే మనదేశం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు యాప్ గుర్తుకు వస్తున్నది కదూ?


logo