బుధవారం 20 జనవరి 2021
International - Dec 10, 2020 , 10:30:56

స్పేస్ఎక్స్ ప్ర‌యోగం.. కూలిన స్టార్‌షిప్ రాకెట్‌

స్పేస్ఎక్స్ ప్ర‌యోగం.. కూలిన స్టార్‌షిప్ రాకెట్‌

హైద‌రాబాద్‌:  స్పేస్ఎక్స్ సంస్థ తాజాగా స్టార్‌షిప్ రాకెట్‌ను ప్ర‌యోగించింది. టెక్సాస్ నుంచి జ‌రిగిన ఆ ప్ర‌యోగం ప‌ట్ల అమెరికా వ్యాపార‌వేత్త ఎల‌న్ మ‌స్క్ సంతోషం వ్య‌క్తం చేశారు.  ఎస్ఎన్‌8 కోడ్ పేరుతో ఆ ప్ర‌యోగం సాగింది.  కోకా చికా ఆర్ అండ్ డీ కేంద్రం నుంచి రాకెట్‌ను ప్ర‌యోగించారు.  సుమారు 12.5 కిలోమీట‌ర్ల దూరం అంటే సుమారు 41 వేల ఫీట్ల ఎత్తుకు ఎగిరిన స్టార్‌షిప్‌.. ఆ త‌ర్వాత తిరుగు ప్ర‌యాణ‌మై.. ల్యాండింగ్ స‌మ‌యంలో పేలింది.  50 మీట‌ర్ల పొడుగు ఉన్న స్టార్‌షిప్ .. ఆకాశంలోకి ఎగిరి.. తిరిగి ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో పేల‌డం ప‌ట్ల ఎల‌న్ మ‌స్క్ ఆనందం వ్య‌క్తం చేశారు.  త‌మ టెస్టింగ్ ప్ర‌క్రియ స‌క్సెస్ అయిన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

స్టార్‌షిప్ ప్రాజెక్టుపై ఎల‌న్ మ‌స్క్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.  స్పేస్ఎక్స్ సంస్థ‌కు ఇదే భ‌విష్య‌త్తు అన్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు.  అంత‌రిక్షంలోకి మ‌నుషుల్ని, కార్గో సేవ‌ల్ని ప్రారంభించేందుకు స్టార్‌షిప్ రాకెట్‌ను స్పేస్ఎక్స్ అభివృద్ధి చేస్తున్న‌ది.   చంద్రుడి మీద‌కు, మార్స్ గ్ర‌హం మీద‌కు కూడా ప్ర‌యోగాలు చేప‌ట్టేందుకు స్టార్‌షిప్  ప్రొటోటైప్ రాకెట్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈ ప్ర‌యోగంతో త‌మ‌కు కావాల్సిన డేటా వ‌చ్చిన‌ట్లు స్పేస్ఎక్స్ సీఈవో వెల్ల‌డించారు. మార్స్ గ్ర‌హానికి వెళ్లేందుకు మార్గం సులువైన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.   


logo