మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 19:06:54

ఈ కొవిడేంటో..? ఈ పరీక్షలేంటో..? బోగస్‌లా కనిపిస్తుందే!

ఈ కొవిడేంటో..? ఈ పరీక్షలేంటో..? బోగస్‌లా కనిపిస్తుందే!

స్పేస్‌ఎక్స్, టెస్లా సీఈఓ అయిన ఎలోన్ మస్క్ కొవిడ్-19 పై తన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండురోజుల క్రితం చేసుకున్న పరీక్షల్లో తనకు రెండు సార్లు పాజిటివ్‌ రాగా, మరో రెండు సార్లు నెగెటివ్‌ వచ్చిందని, ఈ కొవిడేంటో? ఈ పరీక్షలేంటో? అంతా బోగస్‌లా కనిపిస్తున్నదని ఒకరకమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకేరోజు ఒకే ల్యాబ్‌లో ఒకే నర్స్‌ తనకు కరోనా వైరస్‌ సంక్రమణ పరీక్షలు జరుపగా ఇలాంటి నివేదికలు రావడం తనను ఆశ్చర్యపరిచిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జలుబుతో బాధపడిన ఎలోన్‌ మస్క్‌ కరోనా వైరస్‌కు గురైన పరీక్షలు చేయించుకున్నారు. ఒకే ల్యాబ్‌లో ఒకే నర్స్‌ చేతుల మీదుగా నాలుగు పరీక్షలు చేయగా.. రెండు పాజిటివ్‌గా, మరో రెండు నెగెటివ్‌గా వచ్చాయి. సాధారణ జలుబు మినహా ఇప్పటివరకు అసాధారణమైన లక్షణాలు ఏవి కనిపించలేదు. దాంతో చాలా ఆశ్చర్యానికి గురైన ఎలోన్‌ మస్క్ .. "చాలా బోగస్ జరుగుతున్నది. కోవిడ్ కోసం నాలుగుసార్లు పరీక్షించారు. రెండు పరీక్షలు ప్రతికూలంగా.. మరో రెండు సానుకూలంగా వచ్చాయి. అదే యంత్రం, అదే పరీక్ష, అదే నర్సు.. ఫలితంలో మాత్రం తేడా ఎందుకో తెలియదు? " అని మస్క్ ట్వీట్ చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇంకా క్లియర్ చేయకపోయినా లేదా ఆమోదించకపోయినా ప్రస్తుత అత్యవసర పరిస్థితుల కారణంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని ఫోర్బ్స్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి. "ఇది నాతోపాటు ఇతరులకు కూడా జరుగుతున్నది. నేను ప్రయోగశాలల నుంచి పీసీఆర్ పరీక్షలను చేయించుకున్నాను. ఫలితాలు రావడానికి ఇంకా 24 గంటలు పడుతుంది" అని మస్క్ చెప్పారు. గత సెప్టెంబరులో న్యూయార్క్ టైమ్స్ పోడ్కాస్ట్ "స్వే" కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, స్థానిక లాక్డౌన్ నిబంధనలను ధిక్కరించి కాలిఫోర్నియాలో టెస్లా కర్మాగారాన్ని ప్రారంభించడాన్ని ఎలోన్‌ మస్క్ సమర్థించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.