మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 18:10:54

బెలారస్ లో లుకాషెంకో విజయం.. రిగ్గింగ్ చేశారంటున్న స్వెత్లానా

బెలారస్ లో లుకాషెంకో విజయం.. రిగ్గింగ్ చేశారంటున్న స్వెత్లానా

మిన్స్క్ :  బెలారస్ ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి ఘన విజయం సాధించారు. లుకాషెంకోకు 80.23 శాతం ఓట్లు రాగా.. ప్రతిపక్ష అభ్యర్థి స్వెత్లానాకు కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి స్వెత్లానా నిరాకరించారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసి గెలిచారంటూ రాజధాని మిన్స్క్‌తోపాటు పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసనకారులను నియంత్రించడానికి పోలీసులు వాటర్ క్యానన్లు, రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇప్పటివరకు మూడు వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.

బెలారస్ ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి విజయం సాధించడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ నుంచి ప్రత్యేక శిఖరాగ్ర సమావేశం కావాలని పోలాండ్ డిమాండ్ చేసింది.

లుకాషెంకో రిగ్గింగ్ చేసి గెలుపొందారంటూ స్వెత్లానా మద్దతుదారులు మిన్స్క్ తోపాటు పలు పట్టణాల్లో ఆందోళనలకు దిగారు. ' టుకాషెంకో వెళ్ళిపోవాలి" అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్రెస్ట్, జోడినో నగరంలో ఇలాంటి ప్రదర్శనలు మిన్నంటాయి. బెలారస్ అంతటా ఇంటర్నెట్ సరఫరాను నిలిపివేశారు.

ముమ్మాటికీ రిగ్గింగ్ తోనే గెలిచాడని, రిగ్గింగ్ చేయడం నా కళ్లతో నేను చూశాననని, లుకాషెంకో విజయాన్ని నమ్మలేమని స్వెత్లానా టిఖానోవ్స్ఖ్యా అన్నారు. మెజారిటీ పూర్తిగా మాకే ఉన్నదని ఎన్నో నివేదికలు చెప్పాయి, అయినప్పటికీ మేం ఓటమిపాలవడం కేవలం రిగ్గింగ్ వల్లేనని చెప్పారు.

ఐరోపా చివరి నియంత

రష్యా పశ్చిమ సరిహద్దులో ఉన్న బెలారస్.. 1991ఆగస్టు 25 న సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. దీని తరువాత రాజ్యాంగం ఏర్పాటైంది. తొలి అధ్యక్ష ఎన్నిక 1994 జూన్ లో జరుగగా.. అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. 1994 నుండి ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. లుకాషెంకోను అక్కడి ప్రజలు నియంతగా చూస్తారు. ప్రతిసారీ ఎన్నికలలో గందరగోళం చేస్తారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.


logo