శుక్రవారం 05 జూన్ 2020
International - May 10, 2020 , 14:56:00

లాక్‌డౌన్‌ను ఎత్తివేయ‌క‌పోతే మా హెడ్ఆఫీస్‌ను త‌ర‌లించేస్తా: ఎల‌న్ మ‌స్క్‌

లాక్‌డౌన్‌ను ఎత్తివేయ‌క‌పోతే మా హెడ్ఆఫీస్‌ను త‌ర‌లించేస్తా: ఎల‌న్ మ‌స్క్‌

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాల‌న్నీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పారిశ్రామిక, వాణిజ్య‌ కార్యకలాపాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ప‌లు దేశాల్లో మూత‌ప‌డ్డ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌లు మెల్ల‌మెల్ల‌గా తెర‌చుకుంటున్నాయి. ఇదే క్ర‌మంలో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణకు అనుమతులు ల‌భించాయి. 

అయితే, క‌రోనా వైరస్‌ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అదే రాష్ట్రంలో ఉన్న టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీలో ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. వెంటనే ఉత్పత్తిని ప్రారంభించ‌డానికి అనుమతించకపోతే సంస్థ ప్రధాన కార్యలయాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌ లేదా నెవాడాకు తరలిస్తామంటూ స్థానిక ప్రభుత్వాన్ని ఎల‌న్ మ‌స్క్ హెచ్చరించారు. 


logo