ఆదివారం 17 జనవరి 2021
International - Jan 02, 2021 , 14:50:41

ఇదో కొత్త రకం బాడీ మసాజ్‌..!

ఇదో కొత్త రకం బాడీ మసాజ్‌..!

బాడీ మసాజ్‌.. పాత కాలంలో ఇండ్లలోనే గానుగ నుంచి తెప్పించిన నువ్వుల నూనెతో జరిపేవారు. రాన్రాను మసాజ్‌ చేసేందుకు ప్రత్యేక సెలూన్లు ప్రారంభమయ్యాయి. కొత్తకొత్త మసాజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆయుర్వేద మూలాలున్న కేరళ మసాజ్‌కు మన దేశంలో ఎంతో ప్రత్యేకత ఉన్నది. సింగపూర్‌ బాడీ మసాజ్‌ ప్రపంచవ్యాప్తంగా పేరుగడించింది. అయితే, పాములతో బాడీ మసాజ్‌ గురించి తెలుసా..? పాములతో మసాజ్‌ ఏంటి..? మరీ దరిద్రంగా అనుకుంటున్నారా? ఇలాంటి మసాజ్‌ ఈజిప్టులో ఎంతో ఆకర్శిస్తున్నది. 

ఈజిప్టు రాజధాని కైరో నగరంలో నెలకొల్పిన ఓ అధునాత స్పా.. సందర్శకుల కోసం ప్రత్యక్ష పాము మసాజ్‌ను అందిస్తున్నది. ఈ సెంటర్లో విషపూరిత పాములతో అనేక రకాల మసాజ్‌లను చేయించుకోవచ్చు. పాము మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని రుజువు అవుతున్నాయని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, ఎండార్ఫిన్‌ను విడుదల చేస్తుందని స్పా యజమాని పేర్కొంటున్నాడు. మసాజ్‌ కేంద్రంలో ప్రత్యక్షంగా పాములు వినియోగదారుల వెనుక, ముఖం మీద జారి వివిధ రకాల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తున్నాయి. 

30 నిమిషాల మసాజ్ సెషన్ కోసం తొలుత ఆయిల్‌ వేసి మసాజ్‌ చేస్తారు. అనంతరం వివిధ రకాల విషపూరిత పాముల కలయికతో విశ్రాంతి కలిగేలా చేస్తారు. ఈ విధమైన మసాజ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పాములపై మనకున్న అవగాహనను మార్చాలని స్పా భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. "పాములను నా వెనుక భాగంలో ఉంచిన తరువాత నాకు ఉపశమనం, పునరుజ్జీవనం లభించాయి. పాములను వీపుపై వేయడంతో మొదట భయపడ్డాను. పాములు నా శరీరంపై ఉండటం వల్ల ఏం చేస్తాయోనని భయపడ్డాను" ఒక కస్టమర్‌ తన అనుభూతిని పంచుకున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.