గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 17:12:52

కరోనా ఎఫెక్ట్: ఖర్చులకు కళ్లెం వేస్తున్న భారతీయులు...

కరోనా ఎఫెక్ట్: ఖర్చులకు కళ్లెం వేస్తున్న భారతీయులు...

ఢిల్లీ : కరోనామహమ్మారి ప్రజలు జీవన శైలినే మార్చివేసింది. దీని ప్రభావం జనాల దైనందిన జీవితాలపై  తీవ్రంగా పడింది. దీంతో ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది ఇప్పుడు ఖర్చు చేయడానికి ముందూ వెనక ఆలోచిస్తున్నారట. ఈ విషయం బ్రిటిష్ లెంటర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు సర్వేలో  తేలింది . కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని, ఆర్థిక రికవరీలోను తీవ్ర అనిశ్చితి నెలకొందని వెల్లడైంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజల వ్యయధోరణులపై సర్వే నిర్వహించింది. బ్రిటన్, హాంగ్‌కాంగ్, భారత్, ఇండోనేసియా, కెన్యా, చైనా, మలేషియా, పాకిస్తాన్, సింగపూర్, తైవాన్, యూఏఈ, అమెరికాలలో ఆన్‌లైన్ మార్గంలో సర్వే నిర్వహించింది. కరోనా ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులు, ఆ మార్పు వారిలో ఎలా ఉంది, ఎంతకాలం కొనసాగుతుంది వంటి అంశాలపై సర్వే నిర్వహించారు.

జూలైలో మొదటి సర్వే నిర్వహించారు. ఇది రెండోది. మొత్తం మూడు సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజాగా రెండో సర్వే ప్రకారం...ఉద్యోగాలు, ఆర్థిక రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో పది  మందిలో తొమ్మిది మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని, ఆచితూచి ఖర్చులు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే మన దేశంలో 90 శాతంగా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 75 శాతంగా మాత్రమే ఉంది. కరోనా కారణంగా ఖర్చులపై జాగ్రత్త పెరిగింది. ఖర్చులు ఆచితూచి చేస్తున్నట్లు 76 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 62 శాతం ఉంది. ఖర్చులకు కళ్లెం వేసేందుకు 80 శాతం మంది కట్టుదిట్టమైన బడ్జెట్ విధానాలను అనుసరిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు 78 శాతం మంది భారతీయులు చెప్పారు. అంతర్జాతీయ సగటు 66 శాతం మాత్రమే ఉంది. కరోనా మహమ్మారికి ముందు ఆన్ లైన్ కొనుగోలుదారుల సంఖ్య 54 శాతంగా ఉంది. నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ పరికరాలకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వీటి కోసం ఖర్చు ఎక్కువ చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా కొనుగోలు చేస్తామని 72 శాతం మంది చెప్పగా, చిన్న వ్యాపారుల నుండి కొనుగోలు చేస్తామని 73 శాతం మంది, తెలిపారు. ఆన్ లైన్ చెల్లింపులు వైపు మొగ్గు చూపుతున్నట్లు 78 శాతం మంది చెప్పారు. కరోనా వైరస్‌కు ముందు సమయంతో పోలిస్తే రాబోయే కాలంలో ప్రయాణాలు, విహార యాత్రలు తగ్గించుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ప్రపంచ సగటు కూడా ఇది 64 శాతంగా ఉంది. దుస్తులపై ఖర్చును తగ్గించుకుంటామని 56 శాతం మంది తెలిపారు. ఇది ప్రపంచ సగటు 55 శాతంగా ఉంది. ఎక్స్‌పెన్సెస్ తగ్గిస్తామని 30 శాతం మంది చెప్పగా, ప్రపంచ సగటు 41 శాతంగా ఉంది. కాగా ఈ సర్వేను 12 దేశాల్లో 12,000 మందితో నిర్వహించారు. 2025 నాటికి దాదాపు నగదురహితం అవుతుందని భారత్‌లో 87శాతం మంది చెప్పగా, ప్రపంచవ్యాప్తంగా సగటు 64 శాతం ఉంది. అమెరికా, బ్రిటన్ మినహా ఇతర దేశాల్లో ఏటీఎం ఉపయోగం క్షీణించింది. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ రెండేండ్ల క్రితంతో పోలిస్తే సగం ఉన్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo