మంగళవారం 31 మార్చి 2020
International - Mar 02, 2020 , 00:36:29

‘ఈబీ-5’ వీసా మరింత ప్రియం

‘ఈబీ-5’ వీసా మరింత ప్రియం

వాషింగ్టన్‌: అమెరికా దేశానికి వలస రావాలనుకొంటున్న భారతీయులు పొందే ‘ఈబీ-5’ వీసాలు మరింత ప్రియం కానున్నాయి. అమెరికా గ్రీన్‌కార్డ్‌ పొందడానికి ఈ వీసాను ఒక రాజమార్గంగా భావిస్తుంటారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ‘ఈబీ-5’ వీసా పొందేందుకు భారతీయులు 5 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీని కింద పెట్టుబడి మొత్తాన్ని పెంచినట్టు అమెరికా గత నవంబర్‌ నెలలోనే ప్రకటించింది. అమెరికా లీగల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ ‘ఈబీ-5’ ఇన్వెస్ట్‌మెంట్‌ వీసా ప్రోగ్రాంలో పెట్టుబడి మొత్తాన్ని గత ఏడాది 9 లక్షల డాలర్లకు (దాదాపు రూ.6.50 కోట్లు) పెంచింది. 1990 తర్వాత పెంచడం ఇదే తొలిసారి. మరోవైపు భారత్‌లో రెమిటన్స్‌పై 5 శాతం అదనపు పన్ను పడనుండటంతో భారతీయులు మరో 50 వేల డాలర్ల వరకు (దాదాపు రూ.36.08లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తల వీసాగా భావించే ఈ వీసాకు దరఖాస్తు చేసే సమయంలో అమెరికాలో పెట్టే పెట్టుబడి మొత్తాన్ని వివరించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాంను సాధారణంగా స్టార్టప్‌ సంస్థలు వినియోగించుకొని అమెరికన్‌ మార్కెట్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకొంటాయి. 
logo
>>>>>>