గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 30, 2020 , 18:58:23

టర్కీ, గ్రీస్‌ను కుదిపేసిన భూకంపం.. కూలిన భవనాలు

టర్కీ, గ్రీస్‌ను కుదిపేసిన భూకంపం.. కూలిన భవనాలు

టర్కీ : గ్రీకు ద్వీపం సమోస్‌కు ఉత్తరాన టర్కీ ఏజియన్ తీరాన్ని శుక్రవారం శక్తివంతమైన భూకంపం తాకింది. టర్కీలోని పశ్చిమతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మీర్‌ ప్రావిన్స్‌లోని ఇజ్మీర్‌ నగరంతో పాటు రాజధాని ఇస్తాంబుల్‌,  గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరాలు ప్రకంపనల ధాటికి వణికిపోయాయి. భూకంప‌ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.


ప్రకంపనల తీవ్రతకు అజ్మీర్‌ నగరంలోని 20 బ‌హుళ‌ అంత‌స్థుల‌ భవనాలు కుప్ప‌కూలాయి. ఆరుగురు మృతిచెంద‌గా 200 మందికి పైగా గాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం. ట‌ర్కీస్ రిసార్ట్ సిటీగా పేర్కొనే అజ్మీర్‌లో స‌ముద్రం ముందుకు చొచ్చుకువ‌చ్చి ప‌లు వీధుల్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా సముద్రంలో స్వల్ప సునామీ సంభవించిన‌ట్లు పేర్కొంటున్నారు. ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు టర్కీ అత్యవసర విపత్తు నిర్వ‌హ‌ణ దళం తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయ చర్యలను ముమ్మ‌రం చేశారు. 

అదేవిధంగా గ్రీస్‌లోని స‌మోస్ తీర‌ప్రాంతాల్లో నివ‌సిస్తున్న సుమారు 45 వేల మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల్సిందిగా గ్రీస్ భూకంప నిరోధక ప్రణాళిక సంస్థ అధినేత ఎఫ్టిహ్మియోస్ లెక్కాస్ సూచించారు. బాధిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. ఏజియన్‌ సముద్ర తీర నగరాలకు త‌ర‌చుగా భూకంపాల‌కు గురైతున్నాయి. గతంలోనూ ప‌లు న‌గ‌రాల‌ను  భారీ భూకంపాలు కుదిపేశాయి.


టర్కీ తూర్పు ఎలాజిగ్ ప్రావిన్స్‌లోని  సివ్రిస్‌లో గ‌డిచిన జ‌న‌వ‌రిలో సంభ‌వించిన భూకంపం కార‌ణంగా 30 మందికి పైగా చ‌నిపోగా 1,600 మందికి పైగా గాయపడ్డారు. జూలై 2019లో సంభ‌వించిన భూకంపం దాటికి గ్రీకు రాజధాని ఏథెన్స్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్తు నిలిచిపోయింది. అదేవిధంగా 2011లో ఆగ్నేయ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల 600 మందికిపైగా చనిపోగా 1999లో ఇస్తాంబుల్ సమీపంలోని టర్కిష్ నగరమైన ఇజ్మిట్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ధాటికి సుమారు 17 వేల మంది మరణించారు. 

టర్కీ, గ్రీస్‌ను కుదిపేసిన భూకంపం.. కూలిన భవనాలు pic.twitter.com/scKsycLxmD

— Namasthe Telangana (@ntdailyonline) October 30, 2020

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.