గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 12, 2020 , 15:48:52

ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌లు.. విదేశాంగ మంత్రి జైశంక‌ర్ సూచ‌న‌

ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌లు.. విదేశాంగ మంత్రి జైశంక‌ర్ సూచ‌న‌

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌, తాలిబ‌న్ మ‌ధ్య ఇవాళ దోహాలో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌ల స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన ఆ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వ నేతృత్వంలో, నియంత్ర‌ణ‌లో చ‌ర్చ‌లు సాగాల‌న్నారు.  శాంతి చ‌ర్చ‌ల‌కు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్ జాతీయ సార్వ‌భౌమ‌త్వాన్ని, భూభాగాన్ని  గుర్తించి చ‌ర్చ‌లు సాగాల‌న్నారు.  మాన‌వ హ‌క్కులు, ప్ర‌జాస్వామ్యం గురించి ఆలోచించాల‌న్నారు. స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల వారి గురించి కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో హింస‌ను రూపుమాపాల‌ని, ఆ దేశంతో భార‌త్ సుమారు మూడు బిలియ‌న్ల డాల‌ర్ల ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు జైశంక‌ర్ తెలిపారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో సుమారు 400 అభివృద్ధి ప్రాజెక్టులు భార‌త్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.  అబ్దుల్లా అబ్దుల్లా, తాలిబ‌న్ డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘ‌ని బ‌రాదార్, అమెరికా మంత్రి మైక్ పాంపియోలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 

  


logo