మంగళవారం 26 మే 2020
International - Apr 05, 2020 , 19:43:59

మూర్ఖుల్లా ప్ర‌వ‌ర్తించొద్దు: ఇమ్రాన్‌ఖాన్‌

మూర్ఖుల్లా ప్ర‌వ‌ర్తించొద్దు: ఇమ్రాన్‌ఖాన్‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్నా పాకిస్థాన్‌లో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్‌లో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. క‌రోనా బారినుంచి అల్లా కాపాడుతాడ‌ని, పాకిస్థానీల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువని సోష‌ల్‌ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు ఇటీవ‌లె త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. సోష‌ల్ మీడియాలో జ‌రిగే త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మి ప్ర‌జ‌లు మూర్ఖుల్లా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. 

అంతేకాదు, నియంత్ర‌ణ పాటించ‌ని వారిని క‌రోనా మహమ్మారి వ‌దిలిపెట్ట‌ద‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని హెచ్చ‌రించారు. అమెరికా, చైనా లాంటి పెద్ద‌పెద్ద దేశాలనే క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేసింద‌ని, ఈ వైర‌స్ రూపంలో ఇప్పుడు మ‌న దేశానికి ఒక పెద్ద స‌వాల్ ఎదురైంద‌ని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ స‌వాల్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. ఇంత‌టి క్లిష్ట స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి చ‌రిత్ర‌లో మూర్ఖులుగా నిలిచిపోవ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo