బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 02:01:02

కమలతో కనకవర్షం

కమలతో కనకవర్షం

  • బిడెన్‌కు 24 గంటల్లో 194 కోట్లు 
  • డిప్యూటీగా కమలాహారిస్‌ ఎంపిక  తర్వాత విరాళాల వెల్లువ 

వాషింగ్టన్‌, ఆగస్టు 13: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహారిస్‌ ప్రభంజనం అప్పుడే మొదలైంది. డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష పదవికి భారత మూలాలున్న కమలాహారిస్‌ను ఎంపిక చేసిన అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌కు విరాళాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. కమలాహారిస్‌ను డిఫ్యూటీ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయనకు 2.6 కోట్ల డాలర్లు (రూ.194.5 కోట్లు) విరాళాలు లభించాయి. గతంలో బిడెన్‌ ఒక్కరోజులో సేకరించిన గరిష్ఠ విరాళాలకు ఇది రెట్టింపు. డెలావర్‌లో బుధవారం కమల, బిడెన్‌ కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికలు కొందరికి వ్యతిరేకంగా మరికొందరికి అనుకూలంగా జరుగుతున్నవి కావని, అమెరికన్ల కోసం అత్యుత్తమంగా పనిచేసేవారికోసం జరుగుతున్నాయని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 30 కోట్ల డాలర్ల విరాళాలను ఇప్పటికే సేకరించినట్టు రిపబ్లికన్‌ పార్టీ జూలైలోనే ప్రకటించింది. 

బిడెన్‌ రిస్క్‌ చేస్తున్నారు: ట్రంప్‌

కమలాహారిస్‌ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్‌ తిట్ల దండకం కొనసాగుతూనే ఉంది. ఆమెను డిఫ్యూటీగా ఎంపిక చేసుకొని బిడెన్‌ రిస్క్‌ చేశారని పేర్కొన్నారు. ‘బిడెన్‌ కమలను ఎంపిక చేసుకున్నారు. ఆమె వల్ల ఒరిగేది శూన్యం. బిడెన్‌ను ఆమెకన్నా ఎక్కువగా అవమానించినవారు ఎవరూ లేరు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.


logo