బుధవారం 27 జనవరి 2021
International - Dec 28, 2020 , 08:57:55

900 బిలియ‌న్ డాలర్ల‌ బిల్లుపై ట్రంప్ సంత‌కం..

900 బిలియ‌న్ డాలర్ల‌ బిల్లుపై ట్రంప్ సంత‌కం..

వాషింగ్టన్‌: క‌రోనా భృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఎట్ట‌కేల‌కు దిగొచ్చారు. 900 బిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీకి ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఆ బిల్లుపై ట్రంప్ సంత‌కం చేశారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు ఉద్దీప‌న ప్యాకేజీ బిల్లును ట్రంప్ తెచ్చారు. క‌రోనా కార‌ణంగా కుదేలైన వ్యాపార సంస్థ‌ల‌తో పాటు పౌరుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అమెరికా సంస్థ‌లు, పౌరుల‌కు వివిధ రూపాల్లో ప్యాకేజీ కింద ఆర్థిక భ‌రోసా క‌ల్పించనున్నారు. 

ఆందోళ‌న ప‌డ్డ నిరుద్యోగులు

ఇప్పటి వరకు ఇస్తున్న నిరుద్యోగ భృతికి శనివారం అర్ధరాత్రితో గడువు ముగియ‌నుంది. ఆలోగా కొత్త బిల్లుపై ట్రంప్‌ సంతకం చేయాల్సి ఉంది. కానీ వారాంతాన్ని గడపడానికి ఫ్లోరిడా పామ్‌ బీచ్‌కి వెళ్లిన ట్రంప్‌... బిల్లుపై సంతకం చేయకపోగా కొత్త వాదన లేవనెత్తడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రంప్ వైఖరితో దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. కరోనా తెచ్చిన కష్టకాలంలో ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై సంతకం చేయడానికి ట్రంప్‌ మీనమేషాలు లెక్కించారు. ఇల్లు గడిపేందుకు అవస్థలు పడుతున్న నిరుద్యోగులు... సకాలంలో సహాయం అందకపోతే రోడ్డున పడతామని ఆందోళన చెందారు. కానీ ఎట్ట‌కేల‌కు ట్రంప్ ఉద్దీప‌న ప్యాకేజీపై సంత‌కం చేయ‌డంతో నిరుద్యోగులు, పౌరులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo