మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 01:44:42

ట్రంప్‌ ఎలాంటోడంటే..

ట్రంప్‌ ఎలాంటోడంటే..

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సంచలన పుస్తకం
  • స్వయంగా రాసిన ఆయన సోదరుడి కుమార్తె
  • అధ్యక్ష ఎన్నికల ముందు దెబ్బకొట్టడానికేనన్న ట్రంప్‌ బృందం

డబ్బు.. డబ్బు ఏం చేస్తావు అంటే? అన్నదమ్ములను విడగొడుతా.. ప్రేమా ఆప్యాయతలను కాలరాస్తా అన్నదంట! అధికారం.. దర్పం ఏం చేస్తావు అంటే? విలువలను మట్టిలో కప్పిపెట్టి.. కుట్రలకు పాల్పడుతా అన్నాయంట మనిషి అన్నాక.. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలు, సామాజిక స్పృహ అనేవి ఉండాలి. అయితే, ఆ వ్యక్తికి అవేమీ లేవు. సమాజంలో మేటిగా చూపించుకునేందుకు పరీక్షల కుంభకోణానికి పాల్పడ్డాడు. తోడబుట్టిన అన్న చనిపోతే సినిమా, షికార్లకు తిరిగాడు. పేరు, గొప్పతనం కోసం దేవుడిని కూడా తాకట్టు పెట్టాడు. ఇంత ‘గొప్ప’ చరిత్ర ఎవరిదనుకుంటున్నారు. అవసరమున్నా, లేకపోయినా.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించే ఇదంతా!

తన సంచలన నిర్ణయాలతో తెంపరితనానికి మారు పేరుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ఆయన సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్‌ ప్రపంచానికి తెలియని కొత్త విషయాలు వెల్లడించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యకిగా ట్రంప్‌ను అభివర్ణించిన ఆమె.. ఆయనలోని మరో కోణాన్ని  తాను రచించిన ‘టూ మచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్‌ వరల్డ్‌ మోస్ట్‌ డేంజరస్‌ మ్యాన్‌' పుస్తకంలో వివరించనున్నారు. ఈ పుస్తకం వచ్చే మంగళవారం విడుదల కానున్నది. అయితే, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ట్రంప్‌ను బద్నాం చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అధ్యక్షుడి బృందం పుస్తకంపై మండిపడుతున్నది. కాగా మేరీ ట్రంప్‌ క్లినికల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. పారనాయిడ్‌ స్కిజోఫ్రేనియా (భ్రాంతిలో బతికేయడం)తో బాధపడుతున్న రోగులను ఆరు నెలలపాటు లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆమె ఈ పుస్తక రచనకు పూనుకోవడం విశేషం. 


అలా వ్యాపారి అయ్యారు

తన తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌ జూనియర్‌ వ్యాపారం నుంచి వైదొలగడంతోనే ట్రంప్‌ క్రమంగా అందులోకి మారారని, అంతేగానీ ఆయనేం గొప్ప వ్యాపారవేత్త కాదని మేరీ పేర్కొన్నారు. ‘వ్యాపారాలను చూసుకోవాలని మా నాన్నకి తాతయ్య ఫ్రెడ్‌ ట్రంప్‌ సీనియర్‌ ఎప్పుడూ చెప్పేవారు. అయితే, మా నాన్న తనకు ఇష్టమైన విమానయాన రంగంలోకి పైలట్‌గా ప్రవేశించారు. ఇదే అదునుగా మా నాన్న స్థానంలోకి డొనాల్డ్‌ ప్రవేశించి వ్యాపారాన్ని చూసుకునేవారు. అయితే, మా నాన్నతో పోలిస్తే డొనాల్డ్‌ ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తక్కువ స్థాయిలో ఉండేవారు. ఒకసారి ఉద్యోగులు అందరి ముందు మా తాతయ్య డొనాల్డ్‌ను.. నువ్వు అతనిలో (ఫ్రెడ్‌ జూనియర్‌) పది శాతం కూడా విలువ చేయవు అని అరిచారు’ 

ఎందుకూ పనికొచ్చేవాడుకాదు!

ట్రంప్‌ తానే గొప్పవాడినని మురిసిపోతారని మేరీ తన పుస్తకంలో ఆరోపించారు. ‘ఆయన భరించలేని జబ్బులను కలిగి ఉన్నారు. శారీరక, మానసిక పరీక్షల్లో కూడా వాటిని నిర్ధారించలేం. తన పొగరుబోతు, గడుసుతనంతో వాస్తవ ప్రపంచానికి ఆయన దూరమవుతున్నారు. మా తాతయ్య ఆస్తి, అధికారంతోనే ఆయన (డొనాల్డ్‌ ట్రంప్‌) వృద్ధి చెందాడు. లేకపోతే ఎందుకూ పనికొచ్చేవాడుకాదు’ 

‘ఛీటింగ్‌' కింగ్‌

చదువులో మేటి అనిపించు కోవడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఛీటింగ్‌ తంతును మేరీ తన పుస్తకంలో వివరించారు. ‘యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రవేశం కోసం ట్రంప్‌ అడ్డదారులు తొక్కారు. ప్రవేశ పరీక్షను ఒక టాపర్‌తో రాయించారు. ఇందుకోసం అతనికి డబ్బు చెల్లించారు. ఈ విధంగా ఆ యూనివర్సిటీలోకి ట్రంప్‌ ప్రవేశించారు. ఇప్పుడేమో.. వార్టన్‌లో సీటు కోసం చాలా కష్టపడ్డట్టు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు’ 

సోదరుడు చనిపోతే సినిమాకు..

రక్త బంధం, ప్రేమ, ఆప్యాయత అనేవి ట్రంప్‌లో ఏ కొశానా లేవని మేరీ తన తండ్రి చనిపోయిన సందర్భాన్ని చెప్పుకొచ్చారు. ‘నా తండ్రి, డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరుడు ఫ్రెడ్‌ ట్రంప్‌ జూనియర్‌కు మద్యపానం అలవాటు ఉండేది. క్రమంగా మద్యానికి బానిసైన ఆయన్ని కుటుంబసభ్యులు కూడా క్రమంగా పట్టించుకోవడం మానేశారు. దీనికి ట్రంప్‌ కూడా ఒక కారణమే. 1981 సెప్టెంబర్‌లో ఓ రోజున ఆయన ఎక్కువ మోతాదులో మద్యాన్ని తాగారు. దీంతో ఆ రాత్రి ఆయనకు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. నాన్నతో దవాఖానకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయన ఒక్కడే దవాఖానకు వెళ్లారు. పరిస్థితులు విషమించి చనిపోయారు. మా నాన్న దవాఖానలో విలవిల్లాడుతుంటే ఆయన సోదరుడు (డొనాల్డ్‌ ట్రంప్‌) ఉల్లాసంగా సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు’

కెమెరాలు ఉంటేనే ప్రార్థనలకు..

ధనం, దర్పం వంటి అంశాలకే డొనాల్డ్‌ ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవారు. దానికోసం భగవంతుడి సేవల్ని కూడా వాడుకునేవారని మేరీ పేర్కొన్నారు. ‘2015లో ఆయన(డొనాల్డ్‌) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించగానే.. మా మేనత్త మెరియానా ఆయన్ని ఒక బఫూన్‌గా అభివర్ణించారు. ఆయనకు కనీస విలువలు లేవన్నారు. చర్చిల్లో ప్రార్థనలు జరిపేందుకు కూడా ఆయన పబ్లిసిటీని కోరుకుంటారు. కెమెరాలు లేనిదే ఆయన చర్చి మెట్లు కూడా ఎక్కరు’

ఢిల్లీ కోలుకున్నదిలా!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోలుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య (రికవరీ రేటు) 62.08 శాతం. ఢిల్లీలో అది 72 శాతం. కొన్ని రోజుల క్రితం కరోనా విలయతాండవం చేసిన ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ఇది. దీనిని సాధించటానికి గల కారణాలను కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. అవి.. 

  • రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తరచుగా సమావేశాలు నిర్వహించి ముఖ్యమైన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం
  • వైద్య సదుపాయాలు, టెస్టులను పెంచటం.. రోజూ దాదాపు 20 వేల టెస్టులు 
  • కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి  కాంటాక్టు ట్రేసింగ్‌ను ప్రభావవంతంగా నిర్వహించటం 
  • ప్రైవేటు దవాఖానల్లో వసూలు చేసే చార్జీలను నియంత్రించటం 

సౌరవిద్యుత్తులో భారత్‌ భేష్‌: గుటెరస్‌ 

యునైటెడ్‌ నేషన్స్‌: కరోనా వైరస్‌ విజృంభించి ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పటికీ భారత్‌లో సౌరవిద్యుత్‌ వేలానికి అద్భుత ప్రతిస్పందన వస్తున్నదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. ప్రపంచంలో సౌర విద్యుత్తు వేలానికి భారతే మంచి ఉదాహరణన్నారు. క్లీన్‌ ఎనర్జీ ట్రాన్సిట్‌ సమ్మిట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భవిష్యత్తులో సౌర విద్యుత్‌ మాత్రమే ఆధారమన్నారు


logo