మంగళవారం 26 మే 2020
International - Feb 22, 2020 , 02:26:33

పక్కా బిజినెస్‌!

పక్కా బిజినెస్‌!
  • పూర్తిగా వాణిజ్యకోణంలోనే ట్రంప్‌ భారత పర్యటన
  • అమెరికా ఉత్పత్తులపై ఇండియాలోనే అత్యధిక సుంకాలు
  • దీనిపై మోదీతోనే తేల్చుకుంటా
  • అద్భుతమైన ఒప్పందం జరుగొచ్చు
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన పూర్తిగా వాణిజ్య కోణంలోనే జరుగనున్నది. సోమవారం నుంచి మొదలుకానున్న తన భారత పర్యటన సందర్భంగా మోదీతో ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపైనే చర్చిస్తానని, అమెరికా ఉత్పత్తులను ప్రచారం చేస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం జరుగొచ్చన్నారు. భారత్‌ కొన్నేండ్లుగా అమెరికా ఉత్పత్తులపై అత్యధిక దిగుమతి సుంకం మోపుతూ తీవ్రంగా దెబ్బకొడుతున్నదని, ఈ విషయమై నేరుగా మోదీతోనే తేల్చుకుంటానని చెప్పారు. 


కోటి మందితో స్వాగతం పలుకుతానని మోదీ తనతో అన్నారని, ఈ పర్యటన తర్వాత తన మనసు కలుషితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. గురువారం అమెరికాలోని కొలరాడోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడారు. తనకు భారత ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ‘వాణిజ్య పరంగా మేమిద్దరం కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉన్నది. అమెరికా ఉత్పత్తులపై ప్రపంచంలోనే అత్యధిక పన్నులు మోపే దేశాల్లో భారత్‌ ఒకటి. ఇది మనల్ని తీవ్రంగా దెబ్బకొడుతున్నది’ అని పేర్కొన్నారు.


ట్రంప్‌ పర్యటన సందర్భంగా భారీ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘రెండు దేశాల మధ్య అద్భుతమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నది. అయితే డీల్‌ సంతృప్తికరంగా లేకుంటే చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు’ అని చెప్పారు. ‘చర్చల నుంచి నేను వెనక్కి తగ్గొచ్చు. లేదా ఎన్నికల తర్వాత ఒప్పందం జరుగొచ్చు. చూద్దాం.. ఏమి జరుగుతుందో’ అని వ్యాఖ్యానించారు. అమెరికాను అన్నింటా ప్రథమ స్థానంలో నిలిపే క్రమంలో తాను మంచి ఒప్పందాలను మాత్రమే స్వాగతిస్తానని స్పష్టంచేశారు. 


బలంగా ద్వైపాక్షిక సంబంధాలు 

అమెరికా-భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ.. ప్రపంచ వాణిజ్యంలో మూడు శాతంగా ఉన్నది. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్‌ లైటైజర్‌ మధ్య కొన్ని వారాలుగా టెలిఫోన్‌ చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య కుదురాల్సిన ఒప్పందాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టీల్‌, అల్యూమినియంపై విధించిన భారీ సుంకాలను తగ్గించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తున్నది. 


దీంతోపాటు కొన్ని దేశీయ ఉత్పత్తులకు జీఎస్పీ కింద పన్ను ప్రోత్సాహకాలు పునః ప్రారంభించాలని, వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ తదితర రంగాల్లో భారత ఉత్పత్తులకు విస్తృత అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు అమెరికా తన వ్యవసాయ రంగ, డెయిరీ ఉత్పత్తులు, వైద్య పరికరాలను భారత మార్కెట్‌లో ప్రోత్సహించాలని డిమాండ్‌ చేస్తున్నది. సమాచార సాంకేతిక పరికరాలపై విధించిన పన్నులను తగ్గించాలని కోరుతున్నది. భారత్‌-అమెరికా మధ్య 2018-19లో రూ.1.21 లక్షల కోట్ల (16.9 బిలియన్‌ డాలర్లు) వాణిజ్య లోటు ఉన్నదని దీనిని పూడ్చాలని అగ్రరాజ్యం కోరుతున్నది. 


భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌ 

కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌కు అమెరికా అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా ఉన్నది. 2018లో భారత్‌ ఎగుమతుల్లో 16 శాతం అమెరికాకే వెళ్లాయి. యురోపియన్‌ యూనియన్‌ (17.8 శాతం) తర్వాతి స్థానం అగ్రరాజ్యానిదే. ఇక భారత్‌ దిగుమతుల్లో చైనా (14.6 శాతం), ఈయూ (10.2 శాతం) తర్వాత అమెరికా (6.3 శాతం) మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు సంబంధించి భారత్‌ ఎనిమిదో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నది.


ఆతిథ్యం మాత్రమే.. ప్రారంభోత్సవం కాదు 

అహ్మదాబాద్‌లో నిర్మించిన మోతేరా స్టేడియం ఈ నెల 24న ‘నమస్తే ట్రంప్‌' సభకు కేవలం ఆతిథ్యం ఇస్తున్నదని, ఇది స్టేడియం ప్రారంబోత్సవం కాదని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జీసీఏ) గురువారం స్పష్టం చేసింది. మోదీ, ట్రంప్‌ సాక్షిగా ఈ స్టేడియంలో జరుగనున్న సభకు లక్ష మందికిపైగా ప్రజలు హాజరవుతారని అంచనా. బహిరంగ సభతోపాటు స్టేడియం ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు, పోలీస్‌ యంత్రాంగం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీసీఏ ఉపాధ్యక్షుడు ధన్‌రాజ్‌ నెత్వానీ గురువారం స్పష్టతనిచ్చారు. ‘సమస్తే ట్రంప్‌ సభకు కేవలం ఆతిథ్యం ఇస్తున్నాం. స్టేడియంను తర్వాత ప్రారంభిస్తాం’ అని మీడియాకు చెప్పారు. మరోవైపు ట్రంప్‌ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారన్న  వార్తలపై గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ స్పందించారు. దానిపై అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.  


కోటిమంది  స్వాగతం  పలుకుతారట! 

భారత్‌లో తనకు ఘన స్వాగతం లభిస్తుందని ట్రంప్‌ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు. మోతేరా స్టేడియం అందమైన, అధునాతనమైన, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమని కితాబిచ్చారు. ‘నమస్తే ట్రంప్‌ ర్యాలీ నా మనసును కలుషితం చేస్తున్నది. నాకు కనీసం కోటి మంది స్వాగతం చెప్తారని ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇక్కడే నాకు సమస్య ఎదురవుతున్నది. ప్రస్తుత మన ప్రసంగ వేదిక చాలా చిన్నది. వేలమంది ఇంకా బయటే ఉన్నారు. భారత్‌లో కోటి మంది మధ్య పర్యటించి వచ్చిన తర్వాత.. మన దగ్గర 60వేల మందితో జరిగే సభలో పాల్గొంటే ఎలా సంతృప్తి చెందుతాను. మోతేరాకన్నా పెద్ద స్టేడియం నిర్మించాలన్న కోరిక పుడుతుంది’ అని పేర్కొన్నారు.తన పర్యటన అనేకరంగాల్లో అమెరికాకు మేలుచేస్తుందన్నారు.


కూతురు, అల్లుడు కూడా వస్తున్నారు !


భారత పర్యటన కోసం ట్రంప్‌ దంపతులతోపాటు వారి కూతురు ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ట్రంప్‌, ఆయన భార్య మెలానియాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్‌ మ్యూనిచ్‌, వాణిజ్యశాఖమంత్రి విల్బర్‌ రోస్‌, జాతీయ భద్రతా సలహాదారు డెరెక్‌ ఓబ్రెయిన్‌, ఇంధనశాఖ మంత్రి డాన్‌ బ్రౌలిట్టే వంటి అత్యున్నత స్థాయి అధికారుల బృందం వస్తున్నారని మాత్రమే అమెరికా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే ఇవాంక దంపతులు కూడా వస్తారని అమెరికా ప్రభుత్వంధ్రువీకరించినట్టు తెలిసింది. 


logo