శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 02:57:54

వైరస్‌కు అడ్డుకట్టలో మేమే మెరుగు

వైరస్‌కు అడ్డుకట్టలో మేమే మెరుగు

  • భారత్‌ తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నది
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 4: మిగతా దేశాలతో పోల్చిచూస్తే కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో అమెరికా మెరుగైన స్థానంలోనే ఉన్నదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. వైరస్‌పై పోరాటంలో భారత్‌ తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నదని, చైనాలో మళ్లీ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. సోమవారం ఆయన వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘కరోనా సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న భారత్‌, వైరస్‌కు పుట్టుకైన చైనా కన్నా మేమే మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నాం. ఈ విషయాన్ని మర్చిపోకండి’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము 6 కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏ దేశము కూడా ఇన్ని పరీక్షలు చేయలేదని ట్రంప్‌ చెప్పారు. తాము చేపడుతున్న చర్యల వల్ల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. గతవారంలో 8.7 శాతంగా ఉన్న పాజిటివ్‌ టెస్ట్‌ రేటు ఇప్పుడు 8 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. దేశంలో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ట్రంప్‌ సూచించారు.


logo