శనివారం 28 మార్చి 2020
International - Mar 14, 2020 , 16:38:48

హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ట్రంప్‌.. క‌రోనా క‌ట్ట‌డికి 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధి

హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ట్రంప్‌.. క‌రోనా క‌ట్ట‌డికి 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధి

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యం అమెరికా జాతీయ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  క‌రోనా నియంత్ర‌ణ‌కు ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుద‌న్నారు.  నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధిని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. రిలీఫ్ ప్యాకేజీ గురించి ఉభ‌య‌స‌భ‌ల్లో ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు.  ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తామ‌న్నారు.  ఎటువంటి వ‌న‌రుల‌ను కూడా వ‌దిలేది లేద‌న్నారు. త‌న ఆదేశాల మేర‌కు కార్నివాల్‌, రాయ‌ల్ క‌రేబియ‌న్‌, నార్వేయ‌న్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌ల‌ను 30 రోజుల పాటు నిలిపేసిన‌ట్లు ట్రంప్ తెలిపారు.  


అమెరికా ప్ర‌జ‌లు ఎక్క‌డ ఉన్నా..  విశ్వాసంతో అంద‌రి క్షేమం కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని కోరారు.  వైర‌స్‌ను అతి సులువుగా ఎదుర్కోంద‌మ‌న్నారు.  మార్చి 15వ తేదీన నేష‌న‌ల్ ప్రేయ‌ర్ డేగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  విప‌త్క‌ర స‌మ‌యాల్లో దైవ ర‌క్ష‌ణ కోసం కూడా ఎదురుచూసిన చ‌రిత్ర అమెరికాకు ఉన్న‌ద‌ని ట్రంప్ అన్నారు. ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మ‌రింత త్వ‌ర‌గా అందేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  మ‌న దేశ ప్ర‌జ‌ల స్పూర్తి, ప‌ట్టుద‌ల బ‌ల‌మైన‌వ‌ని, ప్ర‌స్తుతం ఉన్న విప‌త్తును ఓడిస్తామ‌ని, అమెరికాకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురైన స‌మ‌యంలో దేశం మ‌రింత పురోగ‌మించింద‌న్నారు.  

అమెరికా ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌తో ఉన్న‌ద‌న్నారు.  క‌రోనా వైర‌స్ రెస్సాన్స్ యాక్ట్‌ను ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్ల‌ను కోరారు.  ఈ బిల్లు ద్వారా ఉచితంగా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. క‌రోనా సోకిన ఉద్యోగుల‌కు పెయిడ్ లీవ్ ఇవ్వ‌నున్నారు. క‌రోనాపై ట్రంప్ యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో.. వాల్‌స్ట్రీట్‌లో మార్కెట్ షేర్లు దూసుకువెళ్లాయి. అమెరికా కరోనా సోకిన వారి సంఖ్య 2100కి చేరుకున్న‌ది.  48 మంది మ‌ర‌ణించారు.logo