శనివారం 16 జనవరి 2021
International - Jan 08, 2021 , 13:01:37

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అధ్య‌క్ష పీఠం నుంచి మ‌రో 12 రోజుల్లో దిగిపోనున్న ట్రంప్‌.. తాను చేసిన త‌ప్పుల‌న్నింటి నుంచీ సెల్ఫ్ పార్డాన్ (త‌న‌కు తాను క్ష‌మాభిక్ష‌) చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌న స‌హాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్లు గురువారం న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. క్యాపిట‌ల్ హిల్‌పై త‌న మ‌ద్ద‌తుదారుల దాడి త‌ర్వాత ట్రంప్ ఆందోళ‌న చెందుతున్నారు. తాను అధ్య‌క్ష పీఠం నుంచి దిగిపోయిన త‌ర్వాత త‌న‌పై విచార‌ణ జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న భ‌యంతో త‌న‌కు తాను క్ష‌మాభిక్ష పెట్టుకునే దిశ‌గా ఆలోచ‌న చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే అమెరికా చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ అధ్యక్షుడూ ఈ ప‌ని చేయ‌లేదు. 

రాజ్యాంగం ఏం చెబుతోంది?

అధ్య‌క్షుడైనంత మాత్రాన ఆయ‌న చ‌ట్టానికి అతీతుడేమీ కాద‌ని, త‌న‌కు తాను క్ష‌మాభిక్ష పెట్టుకోవ‌డం కుద‌ర‌దు అని చాలా మంది రాజ్యాంగ నిపుణులు. త‌న విష‌యంలో తాను ఏ వ్య‌క్తీ జ‌డ్జి కాలేర‌ని వాళ్లు వాదిస్తున్నారు. అస‌లు క్ష‌మాభిక్ష అనేది ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తికి ఇచ్చేది త‌ప్ప‌.. త‌న‌కు తాను ఇచ్చుకునేది కాదు అని జార్జ్‌టౌన్ ప్రొఫెస‌ర్ లూయిస్ సీడ్‌మ‌న్ అన్నారు. నిజానికి రాజ్యాంగంలో స్వీయ క్ష‌మాభిక్ష‌కు సంబంధించి స్ప‌ష్టంగా ఏమీ చెప్ప‌లేదు. ఇప్పుడు ట్రంప్ దీనినే ఉప‌యోగించుకొని త‌న‌కు తాను క్ష‌మాభిక్ష పెట్టుకునే ఆలోచ‌న‌లో ఉన్నారు. 

ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు

గ‌తంలో ఏ అమెరికా అధ్య‌క్షుడు కూడా ఇలా స్వీయ క్ష‌మాభిక్ష ఆలోచ‌న చేయ‌లేదు. అయితే చాలా కాలంగాఇది ప‌రిష్కారం లేని స‌మ‌స్య‌గా ఉండిపోయింది. 1974లో నిక్స‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో వాట‌ర్‌గేట్ స్కాండ‌ల్ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఈ స్వీయ క్ష‌మాభిక్ష చ‌ట్ట‌బ‌ద్ధ‌మే అని నిక్స‌న్ లాయ‌ర్ ఆయ‌న‌కు చెప్పారు. కానీ న్యాయ‌శాఖ మాత్రం అలా కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. అలా కాకుండా 25వ స‌వ‌ర‌ణ ప్ర‌కారం అధ్య‌క్షుడు తాను విధులు నిర్వ‌హించ‌లేన‌ని చెబుతూ.. ముందు అధ్య‌క్ష పీఠం నుంచి దిగిపోయి, వైస్ ప్రెసిడెంట్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని.. ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తి అధ్య‌క్ష హోదాలో క్ష‌మాభిక్ష పెట్ట‌వ‌చ్చ‌ని న్యాయ‌శాఖ స్ప‌ష్టం చేసింది. ఒక‌సారి క్ష‌మాభిక్ష పొందిన త‌ర్వాత తిరిగి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌నీ చెప్పింది. ఇదే స‌ల‌హా పాటించిన నిక్స‌న్‌.. అమెరికా చ‌రిత్ర‌లో క్ష‌మాభిక్ష పొందిన ఏకైక అధ్య‌క్షుడిగా నిలిచారు. 

త‌న హ‌క్కు అంటున్న ట్రంప్‌

ఇప్పుడు ట్రంప్‌కు కూడా కొంద‌రు న్యాయ నిపుణులు ఇదే సూచ‌న చేస్తున్నారు. కానీ ఆయ‌న మాత్రం మాట విన‌డం లేదు. సెల్ఫ్ పార్డాన్ అనేది త‌న హ‌క్కు అని వాదిస్తున్నారు. ఇప్పుడే కాదు 2018లోనూ ట్రంప్ ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ ఓ ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్‌గా స్వీయ క్ష‌మాభిక్ష విధించుకునే అధికారం త‌న‌కు ఉన్న‌ద‌ని అప్పుడే ట్రంప్ వాదించారు. చాలా మంది న్యాయ నిపుణులు చెబుతున్న‌ట్లు నాకు నేను క్ష‌మాభిక్ష పెట్టుకునే హ‌క్కు నాకు ఉంది. కానీ నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు క‌దా? అని అప్ప‌ట్లో ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ క్యాపిట‌ల్ హిల్ దాడుల‌తో ఆందోళ‌న చెందుతున్న ట్రంప్‌.. మరోసారి సెల్ఫ్ పార్డాన్ అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. ఒక‌వేళ ట్రంప్ ఇలా చేస్తే అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. అయినా కూడా ఆయ‌న ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత విచార‌ణ ఎదుర్కోవాల్సిందేన‌ని కొంద‌రు న్యాయ నిపుణులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. 


ఇవి కూడా చ‌ద‌వండి

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై

వుహాన్‌లో ఇన్‌ఫెక్ష‌న్లు మూడు రెట్లు అధికం..

తెలంగాణ‌లో స్కూళ్లు తెరిచేదెప్పుడు?