మంగళవారం 26 మే 2020
International - May 02, 2020 , 02:21:16

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌

  • అమెరికా అధ్యక్షుడు పునరుద్ఘాటన
  • డబ్ల్యూహెచ్‌వో సిగ్గుపడాలని ధ్వజం
  • చైనాకు ప్రచార సంస్థలా మారిందని విమర్శ

వాషింగ్టన్‌, మే 1: చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. తమ దేశ నిఘా సంస్థల ప్రకటనను సైతం పక్కనబెడుతూ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. వైరస్‌పై తామింకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని, జంతువుల ద్వారా వైరస్‌ సంక్రమించిందా లేక ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తూ లీక్‌ అయిందా అన్నదానిపై తాము విచారణ జరుపుతున్నామని అమెరికా నిఘా సంస్థలు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని పునరుద్ఘాటించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అన్ని వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. అయితే వైరస్‌ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను బాధ్యున్ని చేయలేమన్నారు. వైరస్‌ను ప్రారంభంలోనే అడ్డుకోలేకపోయారా లేక కావాలనే అలా చేశారా అన్నది పక్కనబెడితే ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. 

చైనా కన్నా మేమే అధిక నిధులిచ్చాం

కరోనా వ్యాప్తి విషయంలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌వో)పై తొలి నుంచి విరుచుకుపడుతున్న ట్రంప్‌ తాజాగా తన స్వరాన్ని మరింత పెంచారు. చైనాకు డబ్ల్యూహెచ్‌వో ప్రజా సంబంధాల ఏజెన్సీలా తయారైందని, అందుకు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. డబ్ల్యూహెచ్‌వోపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన అమెరికా, ఆ సంస్థకు నిధులను సైతం నిలిపివేసింది. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా 500 మిలియన్‌ డాలర్లు అందిస్తుండగా, చైనా కేవలం 38 మిలియన్‌ డాలర్లు మాత్రమే ఇస్తున్నదని చెప్పారు. మరోవైపు, చైనాపై సుంకాలను విధించే అంశాన్ని  పరిశీలిస్తున్నామని ట్రంప్‌ వెల్లడించారు. అయితే రుణాలకు సంబంధించిన ఒప్పందాలను మాత్రం రద్దుచేయబోమన్నారు. 

వరుసగా మూడో రోజు 2వేలకు పైగా మరణాలు..

అమెరికాలో వరుసగా మూడో రోజు గురువారం కూడా 2,000 మందికిపైగా మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 62,000 దాటింది. మరోవైపు, 10.39 లక్షల మందికిపైగా వైరస్‌బారినపడ్డారు. అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాజ్‌లో మరణాల సంఖ్య పెరిగినప్పటికీ గురువారం పాక్షికంగా వ్యాపార సంస్థలను పునఃప్రారంభించారు. టెక్సాస్‌లో గురువారం 50 మందికిపైగా మరణించారు. ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి.


logo