సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 02, 2020 , 12:20:15

డోనాల్డ్ ట్రంప్‌కు ఇదొక్క‌టే దారి..

డోనాల్డ్ ట్రంప్‌కు ఇదొక్క‌టే దారి..

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల్లో ఈసారి ట‌ఫ్ వార్ ఖాయంగా క‌నిపిస్తోంది.  అధ్య‌క్షుడు ట్రంప్‌,  ప్ర‌త్య‌ర్థి బైడెన్‌ల మ‌ధ్య హోరాహోరీ పోరు అనివార్యంగా మారింది.  అగ్ర‌రాజ్య రేసులో ఎవ‌రు నెగ్గాల‌న్నా.. వారికి 270 మార్క్ త‌ప్ప‌నిస‌రి.  ఆ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను ట్రంప్ అందుకునేందుకు ఓ మార్గం ఉంది.  పాపుల‌ర్ ఒపీనియ‌న్ పోల్స్‌లో ట్రంప్ వెనుకంజలో ఉన్నా.. ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేసే కీల‌క‌మైన స్వింగ్ స్టేట్స్‌లో మాత్రం రిప‌బ్లిక‌న్ నేత ఆధిప‌త్యం కొన‌సాగుతున్న‌ది.  మంగ‌ళ‌వారం జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్ అండ‌ర్‌డాగ్ పోటీప‌డుతున్న‌ట్లు చెప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. 125 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ట్రంప్ క‌చ్చితంగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.  ఉత్త‌రాది, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ట్రంప్ క్యాంపు ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్న‌ది.  దాని ఆధారంగానే ఆయ‌న క‌నీసం 125 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలిచే అవ‌కాశం ఉన్న‌ది.  

ఇక నువ్వానేనా అన్న‌ట్లు సాగే రాష్ట్రాల‌ను ప‌రిశీలిద్ధాం. సాంప్ర‌దాయంగా రిప‌బ్లిక‌న్ పార్టీ స‌త్తా చాటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.  అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ రాష్ట్రాలు రిప‌బ్లిక‌న్ల‌కే పట్టం క‌డుతుంటాయి.  వాటిల్లో టెక్సాస్‌(38), జార్జియా(16), ఓహియో(18), ఆరిజోనా(11) రాష్ట్రాల్లో రిప‌బ్లిక‌న్ల‌ను ఫేవ‌ర్ చేస్తాయి.  ఒకవేళ ఈ రాష్ట్రాల‌ను క‌లిపితే, అప్పుడు ట్రంప్ లెక్క 208కి చేరుకుంటుంది.  ఇక గ‌త వందేళ్ల చ‌రిత్ర గ‌మ‌నిస్తే,  ఫ్లోరిడా రాష్ట్రాన్ని కైవ‌సం చేసుకోకుండా ఏ ఒక్క రిప‌బ్లిక‌న్ నేత కూడా వైట్‌హౌజ్ చేరుకోలేదు. అత్యంత కీల‌క‌మైన ఈ రాష్ట్రంలో 29 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. ఒక‌వేళ ఆ ఖాతా ట్రంప్‌తో క‌లిస్తే అప్పుడు ఆయ‌న సంఖ్య 237కు చేరుకుంటుంది. 

ఐవోవా(6), నార్త్ క‌రోలినా(15) రాష్ట్రాల్లో టైట్ ఫైట్ న‌డుస్తోంది.  కానీ 2016లో ట్రంప్ ఆ రెండు రాష్ట్రాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.  ఈసారి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ట్రంప్‌కు ఆ రాష్ట్రాలు ద‌క్కినా.. అప్పుడు రిప‌బ్లిక‌న్ నేత ఎల‌క్టోర‌ల్ ఓట్ల సంఖ్య 258కి చేరుకుంటుంది.  ఇక ట్రంప్ భ‌విష్య‌త్తును తేల్చేది పెన్సిల్వేనియా రాష్ట్రం. ఈసారి డెమోక్ర‌టిక్‌, రిప‌బ్లిక‌న్ల క‌న్ను ఈ రాష్ట్రంపైనే ఉన్న‌ది.  పెన్సిల్వేనియా కుంభ‌స్థ‌లాన్ని ఎవ‌రు కొడితే, వాళ్లు అగ్ర‌రాజ్యాధినేత అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.  అయితే 2016లో పెన్సిల్వేనియాను ట్రంప్ గెలుచుకున్నారు.  ఈ రాష్ట్రాన్ని ఈ సారి ట్రంప్ కైవ‌సం చేసుకుంటే, దాంతో ఆయ‌న లెక్క 278 ఎల‌క్టోర‌ల్ ఓట్లు దాటుతుంది.  ఇదే క‌నుక జ‌రిగితే, ట్రంప్‌ రెండ‌వ సారి దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డుతారు.  లెక్క‌ల అంచ‌నా ఈజీగానే ఉన్నా.. ట్రంప్ గెలుపు అంత సులువు కాదు.