మంగళవారం 31 మార్చి 2020
International - Feb 12, 2020 , 03:00:53

భారత్‌కు శ్వేతసౌధాధిపతి

భారత్‌కు శ్వేతసౌధాధిపతి
  • ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
  • శ్వేతసౌధం, భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి
  • ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆకాంక్ష

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం వెల్లడించింది. తన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్‌కు రానున్న ట్రంప్‌.. ఢిల్లీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి స్టెఫానీ గ్రిషవ్‌ు వెల్లడించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధం, ఇరుదేశాల ప్రజల మధ్య మైత్రీ బంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాయని ఆమె ఆకాంక్షించారు. ఈ పర్యటనపై గత వారాంతం ప్రధాని మోదీ, ట్రంప్‌ ఫోన్‌లో చర్చించారని ఆమె తెలిపారు. 


అధ్యక్షుడి హోదాలో భారత్‌కు ఇదే తొలిసారి 

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ భారత్‌కి రావడం ఇదే తొలిసారని, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2010, 2015లో భారత్‌లో పర్యటించారని ఆ శాఖ తెలిపింది. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు, ఆయన భార్య ఢిల్లీ, అహ్మదాబాద్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, వివిధ వర్గాల వారిని కలుసుకుంటారని వెల్లడించింది. ‘నమ్మకం, విలువలు, పరస్పర గౌరవం, ఇరుదేశాల ప్రజల మధ్యనున్న మైత్రీ బంధం.. భారత్‌, అమెరికా మధ్యనున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని పేర్కొంది.


ఈ పర్యటనతో వాణిజ్యం, రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం, జాతీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించేందుకు పరస్పర సహకారం వంటి అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పురోగతి సాధిస్తాయని, ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ నాయకత్వంలో ఇది జరుగుతున్నదని తెలిపింది. ఇరుదేశాల మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించేందుకు,వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ పర్యటన సాయపడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌ను ట్రంప్‌ కీలక భాగస్వామిగా భావిస్తున్నారని, ఈ పర్యటన ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ‘భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ అధ్యక్షుడు ముకేశ్‌ ఆఘి పేర్కొన్నారు.


logo
>>>>>>