బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 10:38:00

డోనాల్డ్ ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

డోనాల్డ్ ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  వారిద్ద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  త్వ‌ర‌లోనే క్వారెంటైన్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ కాసేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  త‌క్ష‌ణ‌మే రిక‌వ‌రీ ప్ర‌క్రియ‌ను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  వైర‌స్ బారి నుంచి త్వ‌ర‌లోనే విముక్తి చెందుతామ‌ని కూడా ట్రంప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  ట్రంప్ స‌ల‌హాదారు హోప్ హిక్స్‌కు క‌రోనా సంక్ర‌మించింది. ఆమె పాజిటివ్‌గా తేల‌డంతో.. అధ్య‌క్ష సిబ్బంది మొత్తం అప్ర‌మ‌త్త‌మైంది.  ట్రంప్ దంప‌తులు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ప‌రీక్ష ఫ‌లితాలు రాక‌ముందే ట్రంప్ దంప‌తులు క్వారెంటైన్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఫిజీషియ‌న్ రిపోర్ట్‌..

స‌ల‌హాదారు హోప్ హిక్స్ ఎటువంటి బ్రేక్ లేకుండా ప‌నిచేస్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ట్రంప్ వెల్ల‌డించారు.  ఇటీవ‌ల డోనాల్డ్ ట్రంప్‌తో క‌లిసి హిక్స్ అనేక‌సార్లు ప్ర‌యాణం చేశారు.  రెండు రోజుల క్రితం ఓహియాలోని క్లీవ్‌లాండ్‌లో జ‌రిగిన తొలి డిబేట్‌కు కూడా ట్రంప్‌తో క‌లిసి హిక్స్ వెళ్లారు.  మాస్క్ లేకుండానే అధ్య‌క్ష భ‌వ‌న సిబ్బంది ఆమెతో గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది.  కానీ ట్రంప్ మాత్రం ఆమె మాస్క్‌లు ధ‌రించిన‌ట్లు ఓ ఛాన‌ల్‌తో చెప్పారు.  అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో వైట్‌హౌజ్ రిపోర్ట‌ర్ల‌కు ట్రంప్ క‌రోనా రిపోర్ట్‌ను వెల్ల‌డించారు.  అధ్య‌క్షుడు ట్రంప్ వ‌ద్ద ఫిజీషియ‌న్‌గా చేస్తున్న నావీ క‌మాండ‌ర్ డాక్ట‌ర్ సీన్ కాన్లే ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు.  గురువారం సాయంత్రం త‌న‌కు పాజిటివ్ టెస్ట్ ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని, వైట్‌హౌజ్‌లోనే ఉండేందుకు వాళ్లు ఇష్ట‌ప‌డుతున్నార‌ని కాన్లే తెలిపారు. 

ప్ర‌చారానికి బ్రేక్..

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్ క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ తేల‌డం కొంత ఇబ్బందిక‌ర‌మే. ఎన్నిక‌ల తేదీ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ట్రంప్ ఎన్ని రోజుల పాటు క్వారెంటైన్ అవుతారో చెప్ప‌డం క‌ష్ట‌మే.  ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌తో తొలి డిబేట్‌లో ట్రంప్ పాల్గొన్న విష‌యం తెలిసిందే.  ఈనెల 8వ తేదీన రెండ‌వ చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కానీ ఈలోపే ట్రంప్ పాజిటివ్‌గా తేలారు. అయితే క్వారెంటైన్‌కు వెళ్ల‌నున్న ట్రంప్ ఎన్ని రోజులు స్వీయ‌నిర్బంధంలో ఉంటారో తెలియ‌దు.  పాజిటివ్‌గా తేలిన ట్రంప్‌కు ఎటువంటి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయో కూడా ఇంకా నిర్ధార‌ణ కాలేదు. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ట్రంప్ ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. 


logo