గురువారం 04 జూన్ 2020
International - Apr 27, 2020 , 14:30:13

భార్య‌ల‌ను హింసిస్తున్న లండ‌న్ బాబులు!

భార్య‌ల‌ను హింసిస్తున్న లండ‌న్ బాబులు!

లండ‌న్‌: ప‌్రపంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో ఆ మ‌హ‌మ్మారి బారి నుంచి ప్ర‌జ‌లను కాపాడేందుకు దాదాపుగా అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అదే క్ర‌మంలో బ్రిట‌న్‌లోనూ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. అయితే, ప్ర‌జాక్షేమం కోసం అమ‌లుచేస్తున్న ఈ లాక్‌డౌన్ అక్క‌డి మ‌హిళ‌ల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్ కార‌ణంగా భార్య‌భ‌ర్తలు ఇండ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో లండ‌న్‌లో గృహిణుల‌పై హింస రోజురోజుకూ పెరుగుతున్న‌ది. 

2020, మార్చి 9 నుంచి ఏప్రిల్ 19 మ‌ధ్య కేవ‌లం ఆరు వారాల వ్య‌వ‌ధిలోనే లండ‌న్‌లో గృహ‌హింస కేసులో 4,093 మంది అరెస్ట‌య్యార‌ని అక్క‌డి పోలీసులు తెలిపారు. అంటే స‌గ‌టున‌ రోజుకు 100 మంది చొప్పున భార్య‌ల‌ను హింసించి క‌ట‌క‌టాల పాల‌య్యారు. గ‌తంలో పోల్చితే ఈ ఆరు వారాల్లో కేసుల న‌మోదు శాతం 24 శాతం పెరిగింద‌ని పోలీసులు చెబుతున్నారు. ఇక తీవ్ర నేరాలుగా ప‌రిగ‌ణించ‌ని చిన్నచిన్న ఫ్యామిలీ త‌గాదాలు కూడా ఈ ఆరు వారాల్లో భారీగా పెరిగిపోయాయి. గ‌త ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదికి 3 శాతం పెరిగిన కుటుంబ త‌గాదాలు ఈ ఆరు వారాల్లో మాత్రం 9 శాతం పెరిగాయ‌య‌ని పోలీసులు పేర్కొన్నారు. 

ఇక లండ‌న్‌లో గృహ‌హింస ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి లండ‌న్ పోలీసులు కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రించారు. ఒక మ‌హిళ‌ను ఆమె భ‌ర్త రోజూ హింసిస్తున్నాడ‌ట. రోజూ తిట్లు, దెబ్బ‌లు భ‌రిస్తున్న ఆమె ఒక రోజు భ‌ర్త తుపాకీ గురిపెట్టి కాల్చేస్తాన‌ని బెదిరించ‌డంతో షాక్ గుర‌య్యిందట‌. వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా వారు వెంట‌నే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి, అత‌ని కారు డిక్కీలో ఉన్న‌ రెండు లైసెన్స్‌లేని తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నార‌ట‌. మ‌రో ఘ‌ట‌న‌లో ఒక గ‌ర్భిణీ త‌న‌కు క‌డుపులో నొప్పిగా ఉందని హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసింద‌ట‌. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో ఆమె ఇంటికి వెళ్లి ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ట‌. 

అయితే, చికిత్స అనంత‌రం స‌ద‌రు మ‌హిళ ఇంటికి వెళ్ల‌డానికి నిరాక‌రించింద‌ట‌. త‌న భ‌ర్త చిత్ర‌వ‌ధ‌కు గురిచేస్తున్నాడ‌ని చెప్పి విల‌పించింద‌ట‌. దీంతో పోలీసులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ప్ర‌య‌త్నించగా.. త‌న భ‌ర్త‌ను అరెస్ట్ చేయొద్ద‌ని వేడుకుంద‌ట‌. అయినా పోలీసులు మ‌హిళ ఒంటిపై ఉన్న గాయాలను సాక్ష్యంగా తీసుకుని నిందితుడిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశార‌ట‌. కాగా, ఇలాంటి ఉదంతాలు మ‌రెన్నో ఉన్నాయ‌ని, ఈ రెండు ఘ‌ట‌న‌లు కేవ‌లం ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మేన‌ని లండ‌న్ పోలీసులు చెబుతున్నారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo