బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 02, 2020 , 15:38:30

మసీదు రూపం మార్చేసిన చైనా : ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన యూకే దౌత్యవేత్త

మసీదు రూపం మార్చేసిన చైనా : ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన యూకే దౌత్యవేత్త

బీజింగ్ : చైనాలో మైనార్టీల పట్ల అక్కడి ప్రభుత్వ నిరంకుశ విధానాలు మరోసారి బయటకొచ్చాయి. తాము చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని మైనార్టీలపై చైనా ప్రభుత్వం విరుచుకుపడుతున్నదని మీడియాలో వార్తలు వస్తుండగా.. నింగ్క్సియా ప్రావిన్స్ రాజధాని యిన్చువాన్‌లోని నాంగువాన్ మసీదు రూపురేఖలే మార్చేశారని పాత, కొత్త ఫొటోలను చైనాలోని యూకే దౌత్యవేత్త ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో మరో అరాచకం బట్టబయలైంది. మసీదుకు ఉండే ఆకుపచ్చ గోపురాలు, బంగారు మినార్లను తొలగించేశారు. 

యూకే డిప్యూటీ హెడ్ మిషన్ క్రిస్టినా స్కాట్ ఆన్‌లైన్‌లో పంచుకున్న చిత్రాలలో చూపిన విధంగా.. మసీదు దాని రంగు, అలంకరణలను తొలగించినది స్పష్టంగా తెలుస్తున్నది. 'నాన్గువాన్ మసీదు' అనే బోర్డును కూడా చైనీస్ భాషలో రాసి పెట్టారు. ఇతర సందర్శకులను అనుమతించడం లేదు. "నాన్గువాన్ మసీదు ఉద్దేశాన్ని సూచించే కళను తొలగించారు. పొరుగున ఉండే రెస్టారెంట్లు, దుకాణాలను మూసివేశారు" అని ఆమె పోస్ట్‌ పెట్టింది. పాత మసీదు చిత్రాలను కూడా ఆమె ట్వీట్ చేసి.. మసీదు లోపలి భాగం ఎంత అందంగా ఉందో.. అంటూ కితాబునిచ్చారు.

ఇస్లాం ప్రభావాన్ని తగ్గించడానికి సాంస్కృతిక వైట్‌వాష్‌లో భాగంగా చైనా దేశవ్యాప్తంగా మసీదుల నుంచి గోపురాలను తొలగిస్తున్నారని యూకే డైలీ మెయిల్ తెలిపింది. 'లిటిల్ మక్కా' అని పిలుచుకునే లిన్క్సియా నగరంలోని మసీదుల అరబ్ తరహా గోపురాలు, మినార్లలను కమ్యూనిస్ట్ దేశం తొలగించింది. జీ జిన్‌పింగ్.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినప్పటి నుంచి ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రచారాలు పెరిగాయి. చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవలి సంవత్సరాలలో అన్ని మత సంస్థలను విస్తృతంగా అణిచివేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలి సంవత్సరాలలో చైనా జిన్జియాంగ్ అంతటా అనేక ప్రధాన మందిరాలు, మసీదులు, ఇతర పవిత్ర నిర్మాణాలను మూసివేసి కూల్చివేసింది. జిన్జియాంగ్ అంతటా సుమారు 8,500 మసీదులు 2017 నుంచి కూల్చివేయబడ్డాయని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.