శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 18:20:13

మహిళ టాన్సిల్స్‌లో 1.5 అంగుళాల ఏలికపాము!

మహిళ టాన్సిల్స్‌లో 1.5 అంగుళాల ఏలికపాము!

టోక్యో: గొంతునొప్పితో బాధపడుతూ తన దగ్గరికి వచ్చిన ఓ మహిళ టాన్సిల్స్‌ (గవదలు)లో పెద్ద ఏలికపామును చూసి డాక్టర్లే అవాక్కయ్యారు. ఇది ఏకంగా 1.5 అంగుళాల పొడవుండగా, అతినెమ్మదిగా తొలగించి, మహిళ ప్రాణం కాపాడారు. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ గొంతునొప్పితో బాధపడుతూ సెయింట్‌ లూకా దవాఖానకు వచ్చింది. అయితే, సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జలుబు వల్ల గొంతునొప్పి వచ్చిందని డాక్టర్లు మొదట భావించారు. కాగా, తాను సాషిమిని అనే చేపను తిన్న తర్వాత ఈ నొప్పి ప్రారంభమైందని ఆమె వైద్యులకు వివరించింది. (సాషిమి అనేది జపాన్‌లో ప్రసిద్ధ ఆహారం. దీన్ని పచ్చిగానే తినడం వారికి అలవాటు.)

దీంతో వైద్యులు సదరు మహిళ గొంతును నిశితంగా పరీక్షించగా, గవదలలో ఓ ఏలికపామున్నట్లు గుర్తించారు. ఒక మిల్లీ మీటర్‌ వెడల్పు గల ఈ రౌండ్‌వార్మ్‌ను మహిళ టాన్సిల్స్ నుంచి పట్టుకారు ఉపయోగించి తొలగించారు. తొలగించేటప్పుడు కూడా ఈ ఏలికపాము సజీవంగానే ఉంది. డీఎన్‌ఏ పరీక్ష తరువాత, అది నాలుగో దశ లార్వాగా గుర్తించారు. అంటే సదరు మహిళ సాషిమి డిష్‌ తీసుకున్నప్పుడు అది మూడో దశ లార్వాగా ఉన్నదని పేర్కొన్నారు. పచ్చిమాంసం తినేవారిలో ఈ పరాన్నజీవులు కనిపిస్తాయని వారు వివరించారు. సదరు మహిళ పరిస్థితి అదృష్టవశాత్తు బాగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo