మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 15, 2020 , 18:29:33

బాలుడి కోరిక మేరకు బ్యాట్‌మ్యాన్‌ మేకప్‌లో డాక్టర్‌.. వీడియో వైరల్‌

బాలుడి కోరిక మేరకు బ్యాట్‌మ్యాన్‌ మేకప్‌లో డాక్టర్‌.. వీడియో వైరల్‌

వైద్యో నారాయణో హరి.. కొండకచో డబ్బుల కోసం పీక్కుతినే వైద్యులు ఈ ప్రపంచంలో ఉండొచ్చు. కానీ, 99.99 శాతం మంది వైద్యులు నరనారాయణులే. తమ వద్దకు వచ్చేవారికి స్వస్థత చేకూర్చాలన్న తపన వారిలో కనిపిస్తుంది. తమ వద్ద ఉన్న వనరులతో సేవలందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. మరికొందరు డాక్టర్లు తమ వద్దకొచ్చే వారి సంక్షేమాన్ని కోరుకుంటూ తమ చేతనైనా ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. ఇలాంటి వైద్యుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కోరిక తీర్చేందుకు ఆ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్‌.. బ్యాట్‌మ్యాన్‌గా అవతారమెత్తాడు. తనకు బ్యాట్‌మ్యాన్‌ను కలువాలని ఉన్నదని తన మనుసులో మాటను ఆ చిన్నారి తనకు వైద్యం చేస్తున్న డాక్టర్‌ వద్ద బయటపెట్టాడు. దాంతో మరో ఆలోచన చేయకుండా చిన్నారి ముఖంలో చిరునవ్వు కోరుకున్న ఆ వైద్యుడు.. మరుసటి  రోజే బ్యాట్‌మ్యాన్‌ మాదిరిగా దుస్తులు ధరించి మేకప్‌ చేసుకుని దవాఖానలో చిన్నారి ఉంటున్న వార్డులో ప్రత్యక్షమయ్యాడు. బ్యాట్‌మ్యాన్‌లా అలా వార్డులో నడుస్తూ వస్తుండగా.. చిన్నారిని అక్కడి ఓ ఉద్యోగి చేయి పట్టుకుని నడిపించుకుని వచ్చింది. బ్యాట్‌మ్యాన్‌ను గట్టిగా హత్తుకున్న బాలుడు ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో.. చాలా ఎమోషనల్‌గా మారి ఎందరినో కంటతడి పెట్టించింది. ఫీల్‌ గుడ్‌ పేజీ నిర్వాహకులు ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలో వేలల్లో వ్యూస్‌ వచ్చాయి.

"ప్రపంచంలో మంచిని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. ఇది అసాధారణ మంచితనం" అని ఒక నెటిజెన్‌ కామెంట్‌ చేయగా.. "ఈ వీడియో చూసి నేనేమీ కన్నీరు పెట్టట్లేదు.. మీరే కన్నీరు పెట్టారు" అని రాశారు. చిన్నారి కోరికను తీర్చేందుకు బ్యాట్‌మ్యాన్‌లా దుస్తులు ధరించి వచ్చిన డాక్టర్‌ను వేనోళ్లా పొగుడుతూ.. ఇలాంటి వైద్యులు దేశానికి ఒకరున్నా చాలని భావిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.