గురువారం 04 జూన్ 2020
International - Apr 08, 2020 , 15:16:15

హైడ్రాక్సీక్లోరోక్వీన్ గురించి చెప్పిన ఫ్రెంచ్ డాక్ట‌ర్ ఈయ‌నే..

హైడ్రాక్సీక్లోరోక్వీన్ గురించి చెప్పిన ఫ్రెంచ్ డాక్ట‌ర్ ఈయ‌నే..

హైద‌రాబాద్‌: కోవిడ్19 పేషెంట్ల‌కు  హైడ్రాక్సీక్లోరోక్వీన్ ప‌నిచేస్తుంద‌ని చెప్పిన  ఫ్రెంచ్ డాక్ట‌ర్ దిద‌య‌ర్‌ రౌల్ట్ ఈయ‌నే.  ఫ్రాన్స్‌లోని మారిసెల్లి ఈయ‌న‌ది. రౌల్ట్‌ ఓ బ‌యోల‌జిస్ట్‌. మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్ కూడా. ప్ర‌స్తుతం మారిసెల్లిలోని మెడిట‌రేనియ‌న్ ఇన్‌ఫెక్ష‌న్ ఇన్స్‌టిట్యూట్ డైర‌క్టర్‌గా ఉన్నారు. యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో క‌రోనా రోగుల‌ను ట్రీట్ చేయ‌వ‌చ్చు అని రౌల్ట్ ఓ స్ట‌డీ రిలీజ్ చేసిన త‌ర్వాత ఆ ట్యాబ్లెట్‌కు డిమాండ్ పెరిగింది. ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనాకు మందు ఇదే అని రౌల్ట్ మార్చి నెల ఆరంభంలో చెప్ప‌డంతో.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. కేవ‌లం 40 మంది పేషెంట్ల‌పై మాత్ర‌మే తాను స్ట‌డీ చేసిన‌ట్లు డాక్ట‌ర్ రౌల్ట్ తెలిపారు. అయితే దాంట్లో స‌గం క‌న్నా ఎక్కువ మంది కేవ‌లం మూడు నుంచి ఆరు రోజుల్లో త‌మ శ్వాస‌కోస రుగ్మ‌త‌ల నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

యాంటీ బ్యాక్టీరియా డ్ర‌గ్ అజిత్రోమైసిన్ రెగ్యుల‌ర్‌గా ఇవ్వ‌డం వ‌ల్ల మార్పులు గ‌మ‌నించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే ఇది కూడా చైనా డాక్ట‌ర్ల అధ్య‌య‌నం నుంచి తెలుసుకున్న‌ట్లు డాక్ట‌ర్ రౌల్ట్ తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ బ్రాండ్‌నేమ్ ప్లాక్వెనిల్‌తో ఫ్రాన్స్‌లో మందు అమ్ముతుంటారు. మ‌లేరియా చికిత్స‌కు వాడే క్లోరోక్వీన్ క‌న్నా దీని డోస్ ప‌వ‌ర్ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. అయితే సాధార‌ణంగా ఈ డ్ర‌గ్‌ను ఆఫ్రికాలో ప‌ర్య‌టించేవారికి ఇస్తుంటారు. అయితే ఫ్రెంచ్ డాక్ట‌ర్ రౌల్ట్ రిలీజ్ చేసిన స్ట‌డీపై వైద్యులు అభిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.  హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో కోవిడ్ వ్యాధి న‌యం అవుతుంద‌ని మార్చి 22వ తేదీన డాక్ట‌ర్ రౌల్ట్ బృందం మారిసెల్లిలో మీడియా ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ట్రంప్ త‌న ప్రెస్‌మీట్‌లో ఆ డ్ర‌గ్ సంజీవ‌నిగా మార‌నున్న‌ట్లు తెలిపారు. కానీ చాలా వ‌ర‌కు డాక్ట‌ర్లు.. రౌల్ట్ ప‌రిశోధ‌న‌ల‌తో ఏకీభ‌వించ‌డంలేదు. 

ఫ్రెంచ్ డాక్ట‌ర్ చేసిన ట్ర‌య‌ల్స్  విప‌రీత ప‌రిస్థితుల‌కు దారి తీయ‌వ‌చ్చు అని కొంద‌రు ఆరోపించారు. ఎటువంటి చెకింగ్ నిర్వ‌హించ‌కుండానే ఆ డ్ర‌గ్‌ను ఓ అద్భుత మాత్ర‌గా పోల్చ‌డం స‌రికాద‌న్నారు.  యురోపియ‌న్ యూనియ‌న్ ఇంకా ఈ డ్ర‌గ్‌కు ఆమోదం తెలుప‌లేదు.  సాధార‌ణంగా ఆఫ్రికా వెళ్లేవారికి ఈ డ్ర‌గ్ ఇస్తుంటార‌ని, దీనితో ఎటువంటి న‌ష్టం లేద‌ని మారిసెల్లి డాక్ట‌ర్లు చెబుతున్నారు.  అయితే డాక్ట‌ర్ సూచించిన వారు మాత్ర‌మే ఈ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని రౌల్ట్ త‌న వీడియో సందేశంలో కోరారు.

ప్ర‌స్తుతం ఈ మందుల‌ను ప్ర‌పంచ‌దేశాలు స్టాక్ పెట్టుకుంటున్నాయి. భార‌త్ వ‌ద్ద‌ సుమారు 3 కోట్ల మాత్ర‌ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు ట్రంప్ చెప్పారు. ఇక ఈ డ్ర‌గ్‌ను అత్య‌ధికంగా ఎగుమ‌తి చేసే హంగేరి కూడా త‌న ఉత్ప‌త్తిని పెంచింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 కోట్ల డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌నుకుంటున్న‌ది ఆ దేశం. వాస్త‌వానికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఎంత మెరుగ్గా ప‌నిచేస్తుంద‌న్న దానిపై క్లారిటీ లేదు. కానీ వైర‌ల్ లోడ్‌ను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.  కొత్త క‌ణాల‌కు వైర‌స్ సోక‌కుండా అడ్డుకుంటుద‌ని రౌల్ట్ త‌న నివేదిక‌లో చెప్పారు. ఆరంభ‌ద‌శ‌లో క‌రోనా ఉన్న‌వారికి ఈ డ్ర‌గ్‌తో చికిత్స చేస్తే ప్ర‌యోజనం ఉంటుంది. కానీ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో పెద్ద‌గా ఉపయోగంలేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.logo