శనివారం 30 మే 2020
International - May 12, 2020 , 13:05:40

న‌న్ను కాదు.. చైనాను అడ‌గండి

న‌న్ను కాదు.. చైనాను అడ‌గండి

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశం నుంచి ఆయ‌న అర్ధాంత‌రంగా వెన‌క్కి వెళ్లారు. ఆసియా అమెరికా జాతికి చెందిన ఓ రిపోర్ట‌ర్‌తో ట్రంప్ వాగ్వాదానికి దిగారు. సీబీఎస్ న్యూస్ రిపోర్ట‌ర్ వీజియా జియాంగ్ .. మీడియా స‌మావేశంలో ట్రంప్‌ను ప్ర‌శ్నించారు.  వైర‌స్ టెస్టింగ్‌లో మిగితా దేశాల క‌న్నా అమెరికా ముందు ఉన్న‌ద‌ని మీరెందుకు ప‌దేప‌దే చెబుతున్నార‌ని ఆ రిపోర్ట‌ర్ ట్రంప్‌ను అడిగారు.  టెస్టింగ్‌లో ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీ ఏంటి, ప్ర‌తి రోజూ అమెరిక‌న్లు చనిపోతుంటే, దాంట్లో అర్థం ఏముంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు ట్రంప్ జ‌వాబు ఇచ్చారు.  ప్ర‌పంచంలో ప్ర‌తి చోటా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణిస్తున్నార‌ని, ఈ ప్ర‌శ్న చైనాను అడ‌గాల‌ని, న‌న్ను కాదు అని, ఆ ప్ర‌శ్న‌ను చైనాను అడ‌గండి అంటూ ఆ రిపోర్ట‌ర్‌కు ట్రంప్ బ‌దులిచ్చారు.  

జియాంగ్ రిపోర్ట‌ర్ చైనాలో జ‌న్మించింది. కానీ ఆమె వెస్ట్ వ‌ర్జీనియాలో ఉంటున్న‌ది.  ట్రంప్ ఇచ్చిన బ‌దులుకు ఆమె మ‌ళ్లీ మ‌రో ప్ర‌శ్న వేసింది. స‌ర్‌, మీరెందుకు న‌న్ను ప్ర‌త్యేకంగా అలా అంటున్నార‌ని ఆమె ప్ర‌శ్నించింది. మీరేమైన జాతివివ‌క్ష కామెంట్ చేశారా అన్న రీతిలో ఆమె మ‌రో ప్ర‌శ్న వేసింది. అప్పుడు ట్రంప్ మ‌రింత ఘాటుగా స్పందించారు. పిచ్చి ప్ర‌శ్న‌లు వేసే వారికి ఇటువంటి స‌మాధాన‌మే ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు. ఆ స‌మ‌యంలో ట్రంప్ మ‌రో రిపోర్ట‌ర్ ప్ర‌శ్న కోసం ఎదురుచూశారు. మ‌రో మ‌హిళా రిపోర్ట‌ర్‌ను ప్ర‌శ్న అడ‌గబోయిన ట్రంప్ స‌డ‌న్‌గా ఆగిపోయారు.  ఆ మ‌హిళా రిపోర్ట‌ర్ ప్ర‌శ్న వేయ‌బోతున్న స‌మ‌యంలో ట్రంప్ అక‌స్మాత్తుగా వెనుదిరిగి వైట్‌హౌజ్‌లోకి వెళ్లిపోయారు. త‌న‌కు న‌చ్చ‌ని మీడియావారితో ట్రంప్ స‌హ‌జ‌శైలిలోనే రియాక్ట్ అవుతున్నారు. కానీ జియాంగ్ రిపోర్ట‌ర్‌పై దాడిని సోష‌ల్ మీడియాలో ఖండిస్తున్నారు.  ట్రంప్ జాతివివ‌క్ష దాడి చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. logo