శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 01:27:54

వ్యూహం అదిరింది!

వ్యూహం అదిరింది!

వైరస్‌ కట్టడికి వివిధ దేశాల భిన్న స్ట్రాటజీలు

రెండు, మూడు నెలల్లో సత్ఫలితాలు.. కేసులు తగ్గుముఖం

రివర్స్‌ క్వారంటైన్‌తో జర్మనీ, త్రిముఖ వ్యూహంతో చైనా 

‘మెర్స్‌'తో మహమ్మారికి చెక్‌ పెట్టిన దక్షిణ కొరియా 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నది. అయితే, నిన్నమొన్నటిదాకా వైరస్‌ కారణంగా అతలాకుతలం అయిన కొన్ని దేశాలు ఇప్పుడు విశ్వమారి బారి నుంచి తేరుకున్నాయి. లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షలు వంటి నిబంధనలతోనే ఆ దేశాల్లో కరోనా కట్టడి అయిందనుకుంటే పొరపాటే. మరి వైరస్‌ వ్యాప్తికి ముకుతాడు వేయడానికి ఆ దేశాలు అనుసరించిన ‘ప్రత్యేక’ వ్యూహాలేమిటి?


రివర్స్‌ క్వారంటైన్‌-జర్మనీ

‘రివర్స్‌ క్వారంటైన్‌' వ్యూహాన్ని జర్మనీ అమలు చేసింది. ఇందులో భాగంగా వైరస్‌బారిన పడితే దాని తీవ్రత ఎక్కువగా ఉండే వృద్ధులు, గర్భిణిలను వైరస్‌ సోకకముందే విడిగా ఉంచి వైద్య సదుపాయం కల్పించింది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి తగ్గింది.

మెర్స్‌ వ్యూహం- దక్షిణ కొరియా

2015లో దక్షిణ కొరియాలో ‘మెర్స్‌' వ్యాధి ప్రబలింది. వైద్యులు, సిబ్బంది వైరస్‌కు వాహకాలుగా మారారు. ‘మెర్స్‌' అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్న దక్షిణ కొరియా.. కొవిడ్‌ బాధితులకు సేవలను అందించే క్రమంలో వైరస్‌ బారినపడ్డ వైద్య సిబ్బందిని గుర్తించి వారిని విడిగా ఉంచింది. 

వ్యూహానికి ముందు కేసులు 

(రోజుకు) - సగటున 851 

(మార్చిలో); వ్యూహం తర్వాత కేసులు (రోజుకు) 

- సగటున 26 (జూలైలో)

సమూహంపై గురి - సింగపూర్‌

శ్వేత జాతీయులతో పోలిస్తే, నల్ల జాతీయులపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటున్నదన్న నిపుణుల హెచ్చరికలతో సింగపూర్‌ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన కార్మికులు, నల్ల జాతీయులు, ఇతర సమూహాలపై ప్రత్యేక దృష్టి సారించి, చికిత్సను అందించింది. దీంతో వైరస్‌ వ్యాప్తి తగ్గింది.

వ్యూహానికి ముందు కేసులు 

(రోజుకు) - సగటున 1,426 

(ఏప్రిల్‌లో); వ్యూహం తర్వాత కేసులు (రోజుకు) 

- సగటున 123 (జూలైలో)

 హెర్డ్‌ ఇమ్యూనిటీ - బ్రిటన్‌, స్వీడన్‌

దేశ జనాభాలో 70 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురై.. సొంతంగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకొని మహమ్మారి నుంచి బయటపడే ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వ్యూహాన్ని బ్రిటన్‌, స్వీడన్‌ అమలు చేశాయి. మరోవైపు, ప్రయోగాత్మక దశలో ఉన్న ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వ్యూహాన్ని అమలు చేయడంపై నిపుణులు విమర్శలు కురిపించారు. 

వ్యూహానికి ముందు బ్రిటన్‌లో కేసులు (రోజుకు) - సగటున 7,860 (ఏప్రిల్‌లో); వ్యూహం తర్వాత కేసులు (రోజుకు) 

- సగటున 445 (జూలైలో)

త్రిముఖ వ్యూహం - చైనా

వైరస్‌ కేసులను గుర్తించి, చికిత్సను అందించడానికి చైనా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా వైద్యులు, నోడల్‌ ప్రభుత్వాధికారులు రెండు దశల్లో వైరస్‌ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తారు. దీనిని పరిశీలించడానికి ప్రైవేటు ఏజెన్సీలతో చైనా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. 

వ్యూహానికి ముందు చైనాలో కేసులు (రోజుకు) - సగటున 3,324 (ఫిబ్రవరిలో); వ్యూహం తర్వాత కేసులు (రోజుకు) 

- సగటున 7 (జూలైలో)

- నేషనల్‌ డెస్క్‌


logo